ఈ నెల 28న రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నిధుల జమకు బ్రేక్ పడింది. పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తడంతో కేంద్ర ఎన్నికల సంఘం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. రైతుబంధు పథకం నిధులు జమ చేయడానికి కేసీఆర్ సర్కార్కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందాన్ని ఇది తెలియజేస్తోందన్న ఆరోపణలు భారీగా వచ్చాయి.
మరోవైపు రైతుబంధు పథకం నిధులు సుమారు రూ.7 వేల కోట్లకు పైగా మొత్తాన్ని 70 లక్షల రైతుల ఖాతాల్లో ఈ నెల 28న వేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో, కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచనలో పడింది.
ఒకవైపు ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టే చర్యలు తీసుకుంటూ, మరోవైపు చట్టబద్ధ అవినీతికి ఆస్కారం కలిగించేలా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం వుందనే ఆరోపణ ఆలోచింపజేసింది. దీంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న కీలక నిర్ణయం బీఆర్ఎస్కు గట్టి షాక్ ఇచ్చినట్టైంది.
రైతుబంధు పథకం నిధుల పంపిణీకి అనుమతిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన వెలువరించింది. ఎన్నికలకు సరిగ్గా 48 గంటల ముందు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తే ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయని ఆశించిన బీఆర్ఎస్కు ఆశాభంగం కలిగింది. కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయంపై ప్రతిపక్షాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.