వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మిని.. ఈ విజ‌యాలు మాపుతాయా!

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ముగిసిన వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఆసీస్ పై టీమిండియా రెండు విజ‌యాల‌ను న‌మోదు చేసింది. తమ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి కూడా వెళ్ల‌కుండా కొంద‌రు ఆసీస్ ఆట‌గాళ్లు ఇండియాలోనే ఉంటూ…

వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ ముగిసిన వారం రోజుల వ్య‌వ‌ధిలోనే ఆసీస్ పై టీమిండియా రెండు విజ‌యాల‌ను న‌మోదు చేసింది. తమ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి కూడా వెళ్ల‌కుండా కొంద‌రు ఆసీస్ ఆట‌గాళ్లు ఇండియాలోనే ఉంటూ టీ20 సీరిస్ ను ఆడుతున్నారు. దాదాపు ద్వితీయ శ్రేణి జ‌ట్టు త‌ర‌హాలో బ‌రిలోకి దిగిన టీమిండియా ఆసీస్ ను వ‌ర‌స మ్యాచ్ ల‌లో ఓడిస్తోంది. మొద‌టి టీ20లో ఆఖ‌రి బంతికి విజ‌యం సాధించిన టీమిండియా రెండో టీ20లో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవ‌ర్ల‌కు 235 ప‌రుగుల భారీ స్కోరును సాధించ‌గా, ఆ త‌ర్వాత ఆసీస్ 191 ప‌రుగుల‌కు ప‌రిమితం కావ‌డంతో ఇండియాకు 44 ప‌రుగుల తేడాతో భారీ విజ‌యం ద‌క్కింది. త‌ద్వారా ఐదు టీ20ల సీరిస్ లో రెండు  మ్యాచ్ ల‌లో విజ‌యాల‌తో సీరిస్ విజ‌యంలో ముంద‌జ‌లో ఉంది టీమిండియా.

మ‌రి ఇలాంటి ఎన్ని టీ20లు గెలిచినా.. వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైనల్ ఓట‌మికి స‌రిరావు అని వేరే చెప్ప‌న‌క్కర్లేదు. గెల‌వ‌డం ఎలాగో తెలిసిన జ‌ట్టుగా ఇప్పుడు టీమిండియా క‌నిపిస్తోంది. వ‌ర‌ల్డ్ క‌ప్ లో కూడా ఫైన‌ల్ వ‌ర‌కూ జ‌ట్టు కూర్పు, వ్యూహాలు, అన్నీ అద్భుతంగా అనిపించాయి. అయితే కీల‌క మ్యాచ్ లో మాత్రం టీమిండియా త‌న పంథాను అందుకోలేక‌పోయింది. అంతా అనుభ‌వ‌జ్ఞులే అయినా.. ఫైన‌ల్ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయ‌ర్లు చాలా నెర్వ‌స్ గా క‌నిపించారు. 

ఎలాంటి ఆత్మ‌విశ్వాసం లేని వాళ్ల‌లా ఆడారు. సొంత‌గ‌డ్డ‌పై ఆడుతున్న అడ్వాంటేజీని, ప‌ది విజ‌యాల‌ను వ‌ర‌స‌గా నమోదు చేసిన ఫామ్ ను పూర్తిగా మ‌రిచిపోయిన‌ట్టుగా ఆడి ఫ‌లితాన్ని అనుభ‌వించారు. క‌నీస అనుభ‌వం లేని వారిలా ఆడి.. అంది వ‌చ్చిన ప్ర‌పంచ‌క‌ప్ ను జార‌విడుచుకున్నారు. మ‌రి ఇప్పుడు టీ20ల‌లో అద‌ర‌గొడుతున్నారు. అయితే.. ఇలాంటి విజ‌యాలు ఓట‌మిని మ‌రింత‌గా గుర్తు చేసి అభిమానుల‌ను బాధ‌పెట్ట‌డం విషాద‌క‌రం!