టాలీవుడ్ కు ఎన్నికల టెన్షన్

టాలీవుడ్‌లో నిర్మాతల దగ్గర వున్న డబ్బంతా వారిదే కాదు. ఫైనాన్స్ జనాలది ఎలాగూ మేజర్ షేర్ వుంటుంది. రాజకీయ నాయకుల డబ్బులు కూడా టాలీవుడ్ లో తిరుగుతూ వుంటాయి. ఎక్సెస్ మనీ ఏం చేయాలి.…

టాలీవుడ్‌లో నిర్మాతల దగ్గర వున్న డబ్బంతా వారిదే కాదు. ఫైనాన్స్ జనాలది ఎలాగూ మేజర్ షేర్ వుంటుంది. రాజకీయ నాయకుల డబ్బులు కూడా టాలీవుడ్ లో తిరుగుతూ వుంటాయి. ఎక్సెస్ మనీ ఏం చేయాలి. ఎలా స్పిన్ చేయాలి. టాలీవుడ్ నిర్మాతలకు కాస్త వడ్డీకి ఇవ్వడం కూడా ఓ మార్గం. అందరికీ కాకున్నా, సన్నిహతులకు, స్నేహితులకు ఇచ్చి, నెలనెలా వడ్డీలు అందుకోవడం అన్నది కామన్ ప్రాక్టీస్. టాలీవుడ్ లో ఇలాంటి డబ్బులు వున్నాయనే గ్యాసిప్ లు వున్నాయి.

అయితే ఇలాంటి డబ్బులు అయిదేళ్ల వరకు తిరిగి ఇవ్వనక్కరలేదు. కానీ ఎన్నికలు వస్తే మాత్రం ఇవ్వాల్సిందే. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఎక్కువ అవసరం పడేది అప్పుడే. టాలీవుడ్ లో కొంతమంది నిర్మాతల దగ్గర ఆంధ్ర రాజకీయ నాయకుల డబ్బులు వున్నాయనే గుసగుసలు వున్నాయి. మార్చి, ఏప్రిల్ నాటికి ఎన్నికలు రాబోతున్నాయి. ఈ టైమ్ కు డబ్బులు వెనక్కు సర్దుబాటు చేయాల్సి వుంది.

ఆంధ్రకు చెందిన ఇద్దరు ముగ్గురు రాజకీయ నాయకుల డబ్బులు దాదాపు ఏడెనిమిదేళ్ల క్రిందటే టాలీవుడ్ లోని ఒకటి రెండు సంస్థలోకి చేరినట్లు తెలుస్తోంది. వాళ్లు గత అయిదేళ్లుగా అధికారానికి దూరంగా వున్నారు. అందువల్ల ఈసారి ఎన్నికలు వస్తే మాత్రం కచ్చితంగా ఈ డబ్బులు అవసరం. అందువల్ల ఒక్కసారిగా ఈ డబ్బులు అన్నీ వెనక్కు ఇవ్వాల్సి వుంటుంది. 

ఒక్కసారి వెనక్కు ఇవ్వాలంటే మళ్లీ మరో దగ్గర ఫైనాన్స్ అందుకోవాలి. ఎందుకంటే డబ్బులు చలామణీలో వుంటాయి తప్ప, ఇంట్లో పెట్టుకుని కూర్చోరు కదా. అదే విధంగా వివిధ రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల డబ్బులు కూడా కొద్దిగా అయినా ఇండస్ట్రీలో తిరుగుతూ వుంటాయి. వాళ్లు కూడా ఎన్నికలు వస్తే, వివిధ పార్టీలకు సర్దు బాటు చేయాల్సి వుంటుంది. అందువల్ల అవి కూడా వెనక్కు వెళ్లాలి. 

ఇవన్నీ కలిసి టాలీవుడ్ నిర్మాతలు కొంతమందిని అయినా టెన్షన్ పెట్టడం ఖాయం. ఎందుకంటే టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు ఏమంత జోరుగా లేదు.