బీసీ క్రెడిట్ కోసం వైసీపీ వర్సెస్ టీడీపీ

ఉత్తరాంధ్రాలో నూటికి ఎనభై శాతం బీసీలు ఉన్నారు. ఉమ్మడి మూడు జిల్లాలలో బీసీలే అత్యధికులు ఉన్నారు. అనేక బీసీ కులాలకు ఉత్తరాంధ్రా పుట్టిల్లు. బీసీలకు రాజ్యాధికారం అన్నది నినాదంగా ఉంది. ఇప్పటికి డెబ్బై ఏళ్లకు…

ఉత్తరాంధ్రాలో నూటికి ఎనభై శాతం బీసీలు ఉన్నారు. ఉమ్మడి మూడు జిల్లాలలో బీసీలే అత్యధికులు ఉన్నారు. అనేక బీసీ కులాలకు ఉత్తరాంధ్రా పుట్టిల్లు. బీసీలకు రాజ్యాధికారం అన్నది నినాదంగా ఉంది. ఇప్పటికి డెబ్బై ఏళ్లకు ముందే బీసీ నేత సర్దార్ గౌతు లచ్చన్న బీసీల గొంతుక అయ్యారు.

ఆయన బీసీలలో చైతన్యం తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. ఆ తరువాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత బీసీలకు కొంత న్యాయం జరిగింది. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీ కార్పోరేషన్లు ఏర్పాటు చేశారు. పదవులు కూడా ఎక్కువగా బీసీలకు కేటాయించారు.

సామాజిక సాధికార యాత్ర గత నెల రోజులుగా ఉత్తరాంధ్రాలో జోరుగా సాగుతోంది. బీసీలకు ఇతర అణగారిన వర్గాలకు వైసీపీ ఏమి చేసిందో నేతలు ప్రతీ నియోజకవర్గం వెళ్ళి మరీ ప్రజలకు సవివరంగా తెలియచేస్తున్నారు.

దీంతో తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తం అయింది. బీసీ నాయకుడు సీనియర్ టీడీపీ నేత యనమల రామక్రిష్ణుడు తాజాగా విశాఖలో బీసీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి టీడీపీ మాత్రమే బీసీలకు పెద్ద దిక్కుగా ఉందని వెల్లడించారు. బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేసింది టీడీపీ మాత్రమే అని ఆయన అంటున్నారు

బీసీలకు తాము అధికారంలోకి వస్తే మరింత మేలు చేస్తామని యనమలతో పాటు టీడీపీ నేతలు చెబుతున్నారు. దీన్ని వైసీపీ నేతలు తిప్పి కొడుతున్నారు. తమ సభలు విజయవంతం కావడం వల్లనే టీడీపీ ఉలిక్కిపడుతోందని అంటున్నారు. 

బీసీలకు గతంలో ఇన్ని పదవులు ఎపుడైనా దక్కాయా అని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష టీడీపీ బీసీలకు తామే మేలు చేశామని చెప్పుకుంటున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీసీ కార్డుతో ముందుకు సాగుతున్నాయి. బీసీల జిల్లాలుగా ఉన్న ఉత్తరాంధ్రాలో ఏ పార్టీ ప్రభావం ఎంత ఉంది అన్నది రానున్న కాలమే తేల్చి చెబుతుంది అని అంటున్నారు.