చెప్పిందే చెప్పడం రాజకీయ నాయకులకు బోర్ కొట్టకపోవచ్చు కానీ జనలకు మాత్రం ఆసక్తి తగ్గిపోతోంది. జగన్ లక్ష కోట్లు అంటూ 2011 నుంచి తెలుగుదేశం ప్రచారం చేస్తూ వచ్చింది. దాని మీద కాంగ్రెస్ తో కలసి కోర్టు కు వెళ్లింది. సీబీఐ విచారణను జగన్ ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం ఆ కేసు విచారణ దశలో ఉంది. లక్ష కోట్లు అంటూ 2019 ఎన్నికలలో కూడా టీడీపీ వెళ్ళినా జనాలు వైసీపీని గెలిపించారు 2024 ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మరోమారు టీడీపీ నుంచి లక్ష కోట్లు జగన్ అంటూ విమర్శలు చేస్తున్నారు.
తండ్రి వైఎస్సార్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ లక్ష కోట్లు సంపాదించారు అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు లేటెస్ట్ గా పాత ఆరోపణను మళ్లీ వినిపించారు. ఇదంతా క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కి దక్కింది అని ఆయన అంటున్నారు. సీబీఐ జగన్ మీద 11 కేసులు నమోదు చేసి 45 కోట్ల విలువ చేసే ఆస్తులు సీజ్ చేసింది అని ఆయన చెప్పారు.
ఈ కేసులో కోర్టు ఏమి చెబుతుంది అన్నది చూడాలి. టీడీపీ నేతలు మాత్రం లక్ష కోట్లు జగన్ అని మళ్లీ అదే నినాదం అందుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో దాన్నే ముందుకు తీసుకుని పోవాలని చూస్తున్నారు. చంద్రబాబు మీద అవినీతి ఆరోపణలతో వైసీపీ కేసులు పెడుతోంది.
ఆయన అరెస్ట్ అయి జైలులో కొన్నాళ్ళు ఉన్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో అవినీతి అంశం రెండు పార్టీల అజెండా కానుందా అన్న డౌట్లు వ్యక్తం అవుతున్నాయి. అయినా పాత పాటను పాడితే ఫలితం ఉంటుందా అన్నది సొంత పార్టీలోనే ఆలోచనగా ఉంది అంటున్నారు.