ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీలో అసలేం జరుగుతోంది? అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక్కడి నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం అంబటికి సొంత పార్టీలోనే అసమ్మతి బెడద ఎక్కువగా వుంది. రానున్న ఎన్నికల్లో వైసీపీలోని అసమ్మతి ఏం చేస్తుందో అనే భయం ఆ పార్టీ అధిష్టానాన్ని వెంటాడుతోంది.
ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సర్వే నివేదికల ఆధారంగా టికెట్లు ఇస్తానని, ప్రజల్లో ఆదరణ తగ్గకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులదే అని సీఎం జగన్ అనేక సార్లు చెప్పారు. గెలుపే ప్రామాణికంగా టికెట్లు ఇస్తానని, తన చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం లేదని కూడా ఆయన హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో ఎర్రం వెంకటేశ్వరరెడ్డి విస్తృతంగా పర్యటించడం వెనుక వ్యూహం ఏంటనేది అంతుచిక్కడం లేదు. సత్తెనపల్లిలో వెంకటేశ్వరరెడ్డికి మంచి పేరు ఉన్నట్టు వినికిడి. ఈయన 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సత్తెనపల్లి నుంచి గెలుపొందారు. 2019లో జనసేన తరపున పోటీ చేసి ఓడిపోయారు. సత్తెనపల్లిలో కాపుల ఓట్లు ఎక్కువే. ఈ దఫా అక్కడి నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ బరిలో నిలవనున్నారు.
టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం, పవన్‌కల్యాణ్‌ను అంబటి పదేపదే విమర్శిస్తున్న నేపథ్యంలో కాపుల ఓట్లు వైసీపీకి గతంలో మాదిరిగా వేయరనే టాక్ వినిపిస్తోంది. పైగా కన్నా లక్ష్మినారాయణ కాపు సామాజిక వర్గ నేత. ఆయనకు తన సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లి నుంచి అంబటిని బరిలో నిలపడంపై వైసీపీ అధిష్టానం పునరాలోచన చేస్తున్నట్టు సమాచారం. అంబటిని మరో నియోజకవర్గానికి మార్చొచ్చనే ప్రచారం లేకపోలేదు. సత్తెనపల్లెకు అంబటి నాన్ లోకల్.
ఎర్రం వెంకటేశ్వరరెడ్డి విషయానికి వస్తే ఇతర కులాల్లో కూడా సానుకూలత ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంబటితో పోల్చుకుంటే వెంకటేశ్వరరెడ్డిపై వ్యతిరేకత లేదు. వీళ్లిద్దరిలో ఎవరిని నిలబెడితే గెలుపు అవకాశాలు వుంటాయో బేరీజు వేసుకుని జగన్ కీలక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వెంకటేశ్వరరెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయడంపై ప్రజల్లో అభ్యర్థి మార్పుపై పెద్ద ఎత్తునా చర్చ జరుగుతోంది.