ఈ దఫా అయినా నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా ముగుస్తుందా? లేదా? అనే చర్చకు తెరలేచింది. చంద్రబాబునాయుడు, లోకేశ్ చేపట్టే కార్యక్రమాల వేళా విశేషం ఏమో కానీ, అశుభాలు చోటు చేసుకుంటూ వచ్చాయి.
చంద్రబాబు సభలు పెడితే… ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. లోకేశ్ పాదయాత్ర మొదలు పెట్టిన రోజే తారకరత్నకు గుండె పోటు వచ్చింది. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు.
లోకేశ్ పాదయాత్రలో వుండగా సెప్టెంబర్ 9న చంద్రబాబునాయుడు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడలో లోకేశ్ పాదయాత్ర అర్ధంతరంగా ఆగిపోయింది. దీంతో ఆయన పూర్తిగా యువగళం పాదయాత్రకు ముగింపు పలికినట్టే అనుకున్నారు. అయితే పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించక తప్పలేదు.
75 రోజుల తర్వాత ఎట్టకేలకు లోకేశ్ సోమవారం నుంచి నడక పునఃప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఇందుకోసం ఆయన ఆదివారం సాయంత్రం పొదలాడ గ్రామానికి చేరుకున్నారు. శుభమా అని ఆయన పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా ఎలా ఆటంకాలు లేకుండా లోకేశ్ పాదయాత్రను పూర్తి చేసుకోవాలని ఆకాంక్షిద్దాం.