యానిమల్ సినిమా భారీ రన్ టైమ్ తో వస్తోందనే విషయాన్ని ఇదివరకే చెప్పుకున్నాం. అక్షరాలా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ తో వస్తున్న ఈ సినిమాపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంత నిడివి సినిమాను ఈ కాలం ఆడియన్స్ భరించగలరా అనే సందేహం వ్యక్తం చేశారు.
ఈ డౌట్స్ పై యానిమల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్పందించాడు. అందరు దర్శకుల్లానే ఇతడు కూడా భారీ నిడివిపై నమ్మకం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి సినిమాను ప్రస్తావిస్తున్నాడు.
“భారీ రన్ టైమ్ ఇబ్బంది కాదు. అర్జున్ రెడ్డి 3 గంటల 6 నిమిషాలుంది. అది ఒక అమ్మాయి అబ్బాయి కథే. యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్ధులు ఇలా చాలా లేయర్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి కంటే జస్ట్ 15 నిమిషాలే ఎక్కువ. కాబట్టి మరో 10 నిమిషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది.”
ఇలా యానిమల్ రన్ టైమ్ పై పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు సందీప్ వంగ. ఏకంగా 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్ తో ఓ సినిమా రావడం ఈమధ్యకాలంలో ఇదే తొలిసారి. కంటెంట్ పై నమ్మకంతో మేకర్స్ రన్ టైమ్ విషయంలో పట్టింపులకు పోవడం లేదు. అయితే మరీ ఇంత పెద్ద రన్ టైమ్ అంటే మాత్రం ఆలోచించాల్సిందే. కంటెంట్ పై సందీప్ కు ఉన్న నమ్మకానికి ఇదే సాక్ష్యం అని కొందరు చెబుతుంటే, మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదంటూ మరికొందరు చర్చించుకుంటున్నారు.
రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. డిసెంబర్ 1న థియేటర్లలోకి వస్తోంది యానిమల్ సినిమా.