మొన్నటివరకు వీళ్లంతా ఫుల్ బిజీ. ఎప్పుడైతే ఫ్లాపులు వెక్కిరించాయో, ఆ వెంటనే వాళ్ల కెరీర్ తిరగబడింది. అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన వీళ్లంతా ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో కొత్తకొత్త ఫొటోలు పెడుతూ ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
కృతి శెట్టి.. ఉప్పెనతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమా సక్సెస్ తర్వాత వరుసపెట్టి అవకాశాలు అందుకుంది. ఒక దశలో ఆమె కాల్షీట్ల కోసం క్యూ కట్టే పరిస్థితి వచ్చింది. అలా వరుసగా సినిమా ఛాన్సులు అందుకున్న కృతి శెట్టి, సరైన కథలు ఎంచుకోలేకపోయింది. దీంతో తొందరగానే ఆమెకు ఫ్లాపులొచ్చాయి.
ఓ వైపు మంచి నటిగా గుర్తింపు వచ్చినప్పటికీ, ఫ్లాపులు రావడం ఆమె కెరీర్ కు ఇబ్బందిగా మారింది. కస్టడీ ఫ్లాప్ తర్వాత కృతికి పరిస్థితి పూర్తిగా అర్థమైంది. వెంటనే తమిళ, మలయాళ సినిమాలు అంగీకరించడం మొదలుపెట్టింది. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ పొజిషన్ ఏంటంటే.. చేతిలో ఒకే ఒక్క తెలుగు సినిమా ఉంది.
కృతి శెట్టి తర్వాత ఖాళీ అయిన భామ పూజాహెగ్డే. ఈమె పరిస్థితి మరీ దారుణం. పెద్ద పెద్ద సినిమాల్లో నటించింది. దురదృష్టవశాత్తూ అన్నీ ఫ్లాపులే. ఆచార్య, రాధేశ్యామ్ లాంటి సినిమాలు డిజాస్టర్లయ్యాయి. ఎట్టిపరిస్థితుల్లో గురి తప్పదనుకున్న సల్మాన్ ఖాన్ సినిమా కూడా బాల్చీ తన్నేయడంతో పూజా లెక్క తప్పింది.
ఇలా వరుస ఫ్లాపులకు తోడు ఆల్రెడీ అంగీకరించిన 2 సినిమాలు కూడా పూజా చేజారాయి. వీటిలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ గుంటూరుకారం. త్రివిక్రమ్-మహేష్ కాంబోలో వస్తున్న ఈ సినిమా నుంచి పూజా తప్పుకుంది. దీంతో ప్రస్తుతం ఆమె ఫొటోషూట్స్ తో కాలక్షేపం చేస్తోంది. చేతిలో ఓ హిందీ సినిమా మాత్రమే ఉంది. సౌత్ లో ఆమె ఇంకా బోణీ తెరవలేదు.
రకుల్ సంగతి సరేసరి. ఒకప్పుడు బిజీ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ, ఇప్పుడు సౌత్ నుంచి పెద్దగా అవకాశాలు అందుకోవడం లేదు. కొండపొలం తర్వాత రకుల్ మళ్లీ టాలీవుడ్ తెరపైకి రాలేదు. సౌత్ కు సంబంధించి ఆమె చేతిలో భారతీయుడు-2 మాత్రమే ఉంది.
వీళ్లంతా ఇలా అవకాశాల్లేక ఇబ్బంది పడుతుంటే, సమంత మాత్రం కావాలనే గ్యాప్ తీసుకుంది. శారీరకంగా పూర్తిగా ఫిట్ అయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వస్తానంటోంది. ప్రస్తుతానికైతే శ్రీలీల, మృణాల్, సంయుక్త మీనన్, నేహాశెట్టి దే హవా నడుస్తోంది.