3 తర్వాత ఏమవుతుందో ముందే చెప్పేశారు!

డిసెంబరు 3వ తేదీ తర్వాత ఏమవుతుంది? 3వ తేదీన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఆతర్వాత.. తెలంగాణలో రాజకీయ కాంబినేషన్లు ఎలా ఉండబోతున్నాయి? ఎలా మారబోతున్నాయి? అనేది అందరికీ…

డిసెంబరు 3వ తేదీ తర్వాత ఏమవుతుంది? 3వ తేదీన అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయనే సంగతి అందరికీ తెలిసిందే. ఆతర్వాత.. తెలంగాణలో రాజకీయ కాంబినేషన్లు ఎలా ఉండబోతున్నాయి? ఎలా మారబోతున్నాయి? అనేది అందరికీ ఆసక్తికరమైన అంశం. 

ఎందుకంటే.. గత ఎన్నికల కంటె ఈసారి పోటీచాలా రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా ఉంది. కాంగ్రెసు పార్టీ వేవ్ కనిపిస్తోంది. ఆ పార్టీనే అధికారంలోకి వచ్చేస్తుందనే అభిప్రాయాలు కూడా అక్కడక్కడా వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఫలితాల తర్వాత ఏం జరుగుతుంది? అనేది కీలకం. అయితే.. భారతీయ జనతా పార్టీ కీలక నాయకుడు, ప్రస్తుత ఎంపీ, కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉన్న ధర్మపురి అర్వింద్.. ఏం జరగబోతున్నదో సీక్రెట్ చెప్పేశారు.

తెలంగాణలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే.. సాధించాల్సిన సింపుల్ మెజారిటీ 60 సీట్లు మాత్రమే. కేసీఆర్ కు ప్రస్తుతం 100కు పైగా సీట్లున్నాయి. ఈ ఎన్నికల్లో ఆయనకు 53 సీట్లు వస్తే చాలు అనేది పలువురి అంచనా.

ఎందుకంటే.. ఎన్నికల సమయంలోనే బేషరతుగా అధికార పార్టీకి గట్టి మద్దతు ఇస్తున్న మజ్లిస్ ఖచ్చితంగా వారి ఏడు స్థానాల బలాన్ని నిలబెట్టుకుంటుందని ఒక అంచనా. ఎన్నికల తర్వాత అయినా సరే కేసీఆర్ పార్టీ కనీసం 53 సీట్లు సాధిస్తే చాలు.. మజ్లిస్ మద్దతుతో వారు అధికార పీఠం మీదికి వస్తారు. కాబట్టి.. ఇతర పార్టీలకు అధికారంలోకి రావడానికి మేజిక్ ఫిగర్ 60 అని భావించేట్లయితే గనుక.. భారాస విషయంలో ఆ మేజిక్ ఫిగర్ 53 మాత్రమే అని అనుకోవాలి.

అలా కాకుండా 53 కంటె నాలుగైదుసీట్ల దూరంలో కేసీఆర్ ఆగిపోతే పరిస్థితి ఏమిటి? ఈసారి అధికారంలోకి వచ్చేస్తామని తొడకొట్టి మరీ బరిలో పోరాడుతున్న బిజెపికి అంత సీన్లేకపోయినా కనీసం పది వరకు సీట్లు సాధిస్తే పరిస్థితి ఏమిటి? అనే భయాలు చాలా మందిలో ఉన్నాయి. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేస్తూ.. ధర్మపురి అర్వింద్ క్లారిటీ ఇచ్చారు. 

రేవంత్ర రెడ్డి కంటె కేసీఆర్ చాలా బెటర్ అని ఆయన తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పోరాటం సమయంలో తెలుగుదేశంలో ఉన్నారని, కేసీఆర్ కనీసం రాష్ట్రం కోసం పోరాడారని అన్నారు. అర్వింద్ మాటల ద్వారా.. 3వ తేదీ తర్వాత.. మేజిక్ ఫిగర్ 53కు తక్కువ పడితే.. భారాసకు మద్దతివ్వడానికి బిజెపి రెడీగా ఉంటుందని అర్థమవుతోంది.

కమలదళం- గులాబీదళం కుమ్మక్కు లోపాయికారీ రాజకీయాలు నడుపుతున్నాయనే అనుమానం ప్రజల్లో ఉంది. పైకి వారు ఎంత తిట్టుకున్నా.. లోలోపల ఒప్పందాలు ఉన్నాయనే అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అర్వింద్ మాటల ద్వారా క్లారిటీ వచ్చేసింది. ఎన్నికల తర్వాత.. అవసరమైతే కేసీఆర్ పల్లకీనైనా మోయడానికి సిద్ధపడతారు గానీ.. కమలనాయకులు..కాంగ్రెస్ కు అధికారం దక్కనివ్వరని అర్థమవుతోంది.