తెలుగుదేశం పార్టీతో పొత్తు తరువాత తొలిసారి విశాఖ వచ్చిన పవన్ ఒక రోజు అంతా విశాఖలో ఉన్నారు. ఈ సందర్భంగా పవన్ చుట్టూ టీడీపీ నేతలే ఎక్కువగా కనిపించారు. విమానాశ్రయంలో పవన్ కి స్వాగతం పలికడం దగ్గర నుంచి ఆయన బీచ్ రోడ్డులో బస చేసిన హొటల్ వద్దకు వచ్చి మరీ ఆయనకు పుష్ప గుచ్చాలు ఇచ్చి మరీ భేటీ కావడం దాకా అంతా తెలుగుదేశం మయంగానే సాగింది.
విశాఖలో పవన్ సొంత పార్టీ జనసేన కంటే టీడీపీ నేతల హడావుడి ఎక్కువగా ఉంది అని అంటున్నారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు సహా ఇతర కీలక నేతలు అంతా పవన్ తో ముచ్చట్లు పెట్టారు.
గంటా అయితే సింహాద్రి అప్పన్న చిత్రపటాన్ని పవన్ కి బహూకరించి శాలువా కప్పారు. ఇప్పటికి అయిదేళ్ల క్రితం టీడీపీ నుంచి వేరుపడి పవన్ ఆ పార్టీని 2019 ఎన్నికల వేళ విమర్శించినపుడు గంటా మీద తీవ్రమైన కామెంట్స్ చేశారు. ఇపుడు చూస్తే అటు పవన్ ని కలసి గంటా చిరునవ్వులు చిందించడం అందరినీ ఆకట్టుకుంది.
టీడీపీ నేతలే పవన్ని కలిశారు అనుకుంటే బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా పవన్ తో భేటీకి ఉత్సహం చూపారు. ఆయన కూడా టీడీపీ నేతలతో కలసి మరీ పవన్ తో ఫోటోలు దిగారు. పుష్ప గుచ్చం తన తరఫున ఆయన ఇచ్చి మరీ జనసేనాని గుడ్ లుక్స్ లో పడ్డారు.
పవన్ పొత్తుతో గెలుపు ఈసారి ఖాయమని టీడీపీ తమ్ముళ్ళు భావిస్తున్నారు. అలాగే పొత్తులలో భాగంగా తమ సీట్లకు ఎసరు రాకుండా పవన్ తో ముందస్తు బంధానికి చూస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.