భర్తను భార్య చంపిన ఘటనలు తరచుగా జరుగుతున్నవే. చాలా ఘటనల్లో వివాహేతర సంబంధాలు, ఆర్థిక కారణాలే ఈ హత్యలకు దారితీస్తున్నాయి. కానీ తాజాగా జరిగిన ఇలాంటి ఓ ఘటనకు కారణం తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం గ్యారెంటీ. తన పుట్టినరోజుకు దుబాయ్ తీసుకెళ్లలేదనే కోపంతో, భర్తను కొట్టి చంపేసింది ఆ మహాఇల్లాలు.
పూణెకు చెందిన నిఖిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. రేణుకతో అతడికి ఆరేళ్ల కిందట పెళ్లయింది. పెళ్లయినప్పట్నుంచి రేణుకను బాగానే చూసుకుంటున్నాడు. అయితే ఈమధ్య అతడి వ్యవహార శైలిలో తేడా వచ్చింది.
రేణుకకు ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం లేదు. ఆ మధ్య తన స్నేహితులు, బంధువుల బర్త్ డే పార్టీల కోసం ఢిల్లీ వెళ్తానంటే పంపించలేదు. చివరికి రేణుక బర్త్ డేకు కూడా దుబాయ్ వెళ్దామని కోరితే తీసుకెళ్లలేదు. కనీసం ఖరీదైన బహుమతి కూడా ఇవ్వలేదు.
దీంతో రేణుక ఆగ్రహం చెందింది. నిఖిల్ ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో అతడి ముక్కు చిదిగిపోయింది, పళ్లు విరిగిపోయాయి. తీవ్రంగా రక్తస్రావమైంది. దెబ్బ గట్టిది కావడంతో నిఖిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు.
కండిషన్ గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడ్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే వైద్యం ప్రారంభించకముందే నిఖిల్ ను పరీక్షించిన వైద్యులు, అతడు అప్పటికే మరణించినట్టు ప్రకటించారు.
జరిగిన ఘటనపై పూణెలోని వన్వాడీ పోలీసులు కేసు నమోదు చేశారు. రేణుకను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. బర్త్ డేకి దుబాయ్ తీసుకెళ్లకపోవడం వల్లనే గట్టిగా కొట్టానని, చనిపోతాడని అనుకోలేదని పోలీసులకు తెలిపింది రేణుక. మృతుడి వయసు 36 ఏళ్లు.