తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వీరిద్దరి మధ్యనా సాపత్యం ఏమిటంటే.. ఎంతసేపూ సమీకరణాలే వీరికి ముఖ్యంగా మారాయి. తెలంగాణలో ఎవరు గెలవాలి, రాజస్తాన్ లో ఎవరు గెలిస్తే వీళ్లకు మేలు, మధ్యప్రదేశ్ పరిస్థితి ఏమిటి? ఆ రాష్ట్రాల్లో బీజేపీ ఓడితే మా వ్యాల్యూ పెరుగుతుంది, మాతో దోస్తీకి వస్తుంది.. ఇలాంటి లెక్కలు చంద్రబాబు అనుకూల వర్గాల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నాయి! ఆ మధ్య కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలప్పుడు అయితే తెలుగుదేశం వర్గాలు తాము గెలిచినంత సంబరం చేసుకున్నాయి. కర్ణాటకలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వీరు చాలా ఆనందపడ్డారు. అంతటితో బీజేపీ తీరు మారుతుందని, తప్పక అయినా తమతో దోస్తీకి వస్తుందని తెలుగుదేశం వర్గాలు భావించాయంటే ఆశ్చర్యం కలగకమానదు.
కర్ణాటక ఫలితాలప్పుడు తెలుగుదేశం సంబరాలు అన్నీ ఇన్నీ కావు! అయితే.. ఆ తర్వాత కూడా బీజేపీ తీరులో పెద్దగా మార్పు లేదు. ఆ తర్వాతే చంద్రబాబు అరెస్టు కూడా జరిగింది. యాభై రోజులు ఆయన జైల్లో గడిపి వచ్చారు. ఇంకా ఏ కేసులో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ ఊహించే పరిస్థితి లేదు! ఎన్నికల వరకూ చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్లు, జైలు టెన్షన్లే ఉంటాయని స్పష్టం అవుతోంది. అయితే చంద్రబాబు మద్దతుదార్లు మాత్రం అక్కడ వాళ్లను ఓడిస్తాం, ఇక్కడ వీళ్లను ఓడించాలంటూ మాట్లాడుతున్నారు. అయితే వారు ముందుగా చేయాల్సింది… చంద్రబాబును గెలిపించుకోవడం. అయితే దానిపై కన్నా.. అక్కడ, ఇక్కడ మీదే వారికి ఆసక్తి ఎక్కువగా ఉంది.
తెలంగాణలో అర్జెంటుగా బీఆర్ఎస్ ను ఓడించేయాలనేది చంద్రబాబు కులస్తుల ఆశ! ఎందుకు అంటే.. వాళ్లంతా అదో టైపు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది తామే అని ప్రచారం చేసుకునేంత వారు! మరి తెలంగాణలో రేపటి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగింది.. తెలంగాణ ప్రజానీకం. అందులో చంద్రబాబు కులస్తుల శాతం చాలా చాలా తక్కువ. వీరు గట్టిగా ప్రభావితం చేయగలరనే నియోజకవర్గాలు వేళ్ల మీద లెక్క బెట్టొచ్చు. ఇంతోటిదానికి వారి కసి.. చూస్తే మాత్రం ఒక రేంజ్ లో ఉంది. చంద్రబాబు అరెస్టు సమయంలో హైదరాబాద్ లో ధర్నాలు చేయనివ్వలేదని బీఆర్ఎస్ ను ఓడించాలని అనుకుంటున్నారో, లేక రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా పరిగణించి.. కాంగ్రెస్ ను గెలిపించాలని అనుకుంటున్నారో కానీ.. చంద్రబాబు కులస్తుల గుల మాత్రం తీవ్రంగా ఉంది!
ఇక పవన్ కల్యాణ్ పరిస్థితి చిత్రం. ఆయనకు ఈయన గెలవడం మీద కలలో కూడా ఆసక్తి లేదు. జగన్ ఓడాలి.. ఇదే పవన్ కల్యాణ్ అభిష్టం. ఇంతకు మించి ఆయనకు రాజకీయాల్లో ఇంకో లక్ష్యం కూడా లేదు. 2014లో తనే జగన్ ను ఓడించినట్టుగా పవన్ కల్యాణ్ 2019 వరకూ భ్రమలో మునిగాడు. ఆ మైకంలోనే జగన్ ను జన్మలో సీఎంను కానివ్వను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవదు, తన మాటే శాసనం అంటూ ఏదేదో ప్రకటించుకున్నాడు పవన్ కల్యాణ్. అయితే.. ప్రజాస్వామ్యంలో ప్రజాభీష్టమే శాసనం తప్ప, తనబోటి నేతల మాటు కావు అని పవన్ కల్యాణ్ కు లేటు అర్థం అయ్యింది. జగన్ ను ఓడించడమే తప్ప మరో లక్ష్యం లేని తన రాజకీయంలో పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడాడు. రాజకీయాల్లోకి వచ్చి 15 యేళ్లు గడుస్తున్నా ఇంకా కనీసం ఎమ్మెల్యే అనిపించుకోలేనంత దుస్థితిలో ఉన్నాడు పవన్ కల్యాణ్. మరి రేపటి ఎన్నికల విషయంలో కూడా పవన్ కల్యాణ్ కు వేరే లక్ష్యం లేదు.
వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడిస్తే తన జన్మ ధన్యం అయిపోయినట్టుగా పవన్ కల్యాణ్ భావిస్తూ ఉండవచ్చు. ఆయన మాటల్లో, చేతల్లో ఇంతకు మించిన రాజకీయ కార్యాచరణ అయితే లేదు. పవన్ కల్యాణ్ కు తన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎన్నో సీట్లలో నిలబడాలని, లేదా అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించాలనే కోరికలు కూడా లేనట్టుగానే ఉన్నాయి. తను సీఎం కావాలనే లక్ష్యం లేదని పవన్ చాలా సార్లు చెప్పాడు. అసలు తెలుగుదేశం పార్టీ తనను ఎందుకు సీఎంగా చేస్తుందంటూ కూడా తన అభిమానులనే ఆయన ప్రశ్నించి కూడాచాలా కాలం అయ్యింది. తమ శక్తి ధారపోసి చంద్రబాబును సీఎంగా చేయడమే తప్ప.. తెలుగుదేశం పార్టీ తనను సీఎంగా చేస్తుందనే భ్రమ పవన్ కు లేదు. అసలు అలాంటి ఉద్దేశం కూడా లేదని తనే తేల్చి చెప్పాడు. కాబట్టి.. చాలా మంది చెప్పుకుంటున్నట్టుగా వచ్చే ఎన్నికల్లో జనసేన 75 సీట్లను కోరుతుంది, లేదా 50 సీట్లకు అయితే ఒప్పుకుంటుంది, కనీసం 30 సీట్లు అనే ది కూడా ఉత్తుత్తి మాటే!
తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు జనసేనకు పదో, 15 సీట్లు కేటాయిస్తే జనసేనకు అదే ఎక్కువ కావొచ్చు. కనీసం ఆ సీట్లలో అభ్యర్థులను పెట్టడానికి కూడా జనసేన మళ్లీ తెలుగుదేశం నుంచినే నేతలను అరువు తెచ్చుకోవాలి. వాళ్లను చంద్రబాబు నాయుడే జనసేనలోకి పంపాలి. గతంలో తన వారిని బీజేపీలోకి పంపించి, ఆ పార్టీకి టికెట్లను కేటాయించినట్టు కేటాయించి, తన వారినే పోటీలో దింపడం, వారినే కేబినెట్ లోకి తీసుకోవడం కూడా చంద్రబాబుకు తెలిసిన విద్యే!
అలాగే.. బీజేపీకి కేటాయించిన సీట్లలో కొన్ని చోట్ల టీడీపీ రెబల్స్ ను బరిలోకి దించి కమలం పార్టీని చిత్తు చేసిన చరిత్ర కూడా చంద్రబాబుదే! బీజేపీకి మోడీ, అమిత్ షా వంటి నాయకత్వం దక్కాకా కూడా ఆ పార్టీతో చంద్రబాబు ఆడని ఆట అంటూ లేదు. అలాంటిది పవన్ కల్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబుకు ఎంత? జనసేనను తనకు కావాల్సినట్టుగా వాడుకోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఇందులో పవన్ కల్యాణ్ కు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు! ఎటొచ్చీ పవన్ కల్యాణ్ ను సీఎంగా చూసుకోవాలి.. జనసేనతో రాజకీయం చేయాలి, జనసేన ద్వారా రాజకీయ గమనం సాగించాలనే భ్రమల్లో ఉన్న వారే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఒక రాజకీయ పార్టీగా జనసేన నిర్మాణాన్ని గమనిస్తే.. ఐదేళ్ల కిందటే అది కాస్త బలంగా కనిపించింది. అప్పుడే జనసేన తరఫున చెప్పుకోదగిన స్థాయిలో నేతలున్నారు. అయితే 2019 ఎన్నికల సమయానికి ఉన్నంత బలంగా కూడా ఇప్పుడు జనసేన లేదు. ఆ పార్టీ ఈ స్థితికి రావడానికి నిస్సందేహంగా పవన్ కల్యాణే వ్యవహరణ తీరే కారణం. ఇప్పుడు పవన్ కల్యాణ్ కు ఉన్న ఆశ, అండ చంద్రబాబు నాయుడు. చంద్రబాబుకు ఉన్న అండ, ఆశ పవన్ కల్యాణ్.
వీరిద్దరికీ ఒక సిద్ధాంతం లేదు, విధానం లేదు. అవసరానికి తగ్గట్టుగా ఎర్రకండువానూ చుట్టగలరు, కాషాయ కండువానే మెడలో వేసుకోగలరు. ఏదైనా మాట్లాడగలరు, దేన్నైనా చెప్పగలరు! అయితే చంద్రబాబుకు అధికారమే పరమావధి. తను, తన కుల బాగోగులు చూసే పెద్ద మనిషిగా చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహారం ఒక కులపెద్ద కన్నా గొప్పగా ఏమీ లేదు, ఆ కులానికి అధికారం కోసం, అహం కోసం విజయం కావాలి. అందుకోసం వారు చంద్రబాబును ముందుండి వ్యవహారం నడపుతున్నారు. తన అహమో మరో కారణంతోనో ఆ కులం ఆటలో పవన్ పావుగా మారాడు!