విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదానికి సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. అగ్నిప్రమాదానికి కారణమైన నాని, సత్యంను అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన సీపీ, ప్రమాదం జరిగిన తీరును వెల్లడించారు.
“వాసుపల్లి నాని, అతడి మామ సత్యం బోటులో కూర్చొని మద్యం సేవించారు. సిగరెట్లు కూడా తాగారు. తాగేసిన సిగరెట్లను పక్కబోటులోకి విసిరేశారు. అక్కడున్న నైలాన్ వలకు నిప్పు అంటుకొని పొగ వ్యాపించింది. దీంతో భయపడిన నాని-సత్యం అక్కడ్నుంచి పారిపోయారు. నైలాన్ వల నిప్పుకు అంటుకొని, మంటలు బోటుకు వ్యాపించాయి. మిగతా బోట్లలో కూడా భారీగా డీజిల్, గ్యాస్ ఉండడం వల్ల, ప్రమాద తీవ్రత పెరిగింది.”
ఈ ఘోర అగ్నిప్రమాదంలో 30 బోట్లు పూర్తిగా కాలిపోయాయని, 18 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని సీపీ వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే విచారణ మొదలుపెట్టామని, వాసుపల్లి నాని ఈ ప్రమాదానికి కారణమని తెలిసిన తర్వాత కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, అందులో భాగంగానే యూట్యూబర్ నానిని కూడా విచారించామని తెలిపారు.
“ఘటన జరిగిన వెంటనే విచారణ మొదలుపెట్టాం. నాని పేరు తెరపైకి వచ్చింది. విచారణలో భాగంగా యూట్యూబర్ నానితో పాటు వాసుపల్లి నాని ని కూడా విచారించాం. ఇదంతా ఇన్వెస్టిగేషన్ లో భాగమే. పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత అతడు కాదని నిర్థారించుకొని వదిలిపెట్టాం. యూట్యూబర్ నాని మాత్రమే కాదు, మరో వాసుపల్లి నాని ని కూడా విచారించాం. అతడి ఆధారాలు కూడా పరిశీలించి కాదని నిర్థారించుకొని వదిలిపెట్టాం. ఘటనకు కారణమైన అసలైన నానిని అరెస్ట్ చేశాం.”
మరోవైపు జరిగిన ఘటనపై లోకల్ బాయ్ నాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు తనను కొట్టారని, తనే బోట్లు తగలబెట్టానని చాలామంది అనుకుంటున్నారని, తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందన్నాడు. తాజాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు బయటపెట్టడంతో లోకల్ బాయ్ నాని ఊపిరిపీల్చుకున్నాడు.