శ్రీలీల మరోసారి తనది రాంగ్ ఛాయిస్ అని నిరూపించుకుంది. మొన్నటికిమొన్న స్కంద సినిమాలో ఆమె పాత్రపై చాలా విమర్శలు చెలరేగాయి. ఆ వెంటనే వచ్చిన భగవంత్ కేసరి ఆమెను ఆదుకుంది. అయితే అలా వచ్చిన ఇమేజ్ ను, ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోగొట్టుకుంది ఈ హీరోయిన్. దీనికి కారణం ఆదికేశవ.
వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఆదికేశవ సినిమాలో శ్రీలీల పాత్ర మరీ పేలవంగా ఉంది. పేరుకు సీఈవో పాత్ర అని చెప్పి, హీరో వెంటపడే సగటు హీరోయిన్ గా మార్చేశారు. సినిమాలో ఎక్కడా ఆమె సీఈవోగా కనిపించదు సరికదా, కనీసం ధనవంతుల బిడ్డ అనే ఫీలింగ్ కూడా చూపించదు. అంత పేలవంగా ఆమె పాత్రను తీర్చిదిద్దారు.
సూపర్ హిట్ సాంగ్స్ కు చిందులేయడం, కింద నుంచి పై వరకు కాళ్లు కనిపించేలా డ్రెస్సులు వేయడం, హీరో వెంటపడడం, హీరోకు మూడొస్తే పాటలకు డాన్స్ చేయడం మినహా, శ్రీలల పాత్రలో ఎలాంటి ప్రత్యేకత కనిపించలేదు. దీంతో స్కంద తర్వాత ఆదికేశవ రూపంలో మరోసారి విమర్శకులకు దొరికిపోయింది శ్రీలీల. ఆమె పాత్రపై తెగ కామెంట్స్ పడుతున్నాయి.
శ్రీలలకు అందం ఉందనే విషయం తెలిసిందే. ఆమెలో మంచి డాన్సింగ్ టాలెంట్ ఉందనే విషయం కూడా ఇప్పటికే ప్రూవ్ అయింది. స్టార్ లీగ్ లో నిలవాలంటే ఇక ఆమె చేయాల్సిందల్లా మంచి కథలు ఎంచుకోవడమే. కథ మొత్తం తనచుట్టూ తిరగక్కర్లేదు. హీరోతో సమాన ప్రాధాన్యం కూడా అక్కర్లేదు. ఉన్నంతలో శ్రీలీల బాగా చేసిందనే పేరు వచ్చే కథల్ని ఆమె ఎంపిక చేసుకోవాలి.
స్కంద, ఆదికేశవ లాంటి రాంగ్ ఛాయిస్ లకు ఇకనైనా ఆమె ఫుల్ స్టాప్ పెట్టాలి. త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరుకారంతో ఆమె కెరీర్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుందేమో చూడాలి.