సీఎం ర‌మేశ్‌ను చూసి… సిగ్గే సిగ్గుప‌డుతోంది!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌కు చెందిన కొంద‌రు నేత‌లు… ఎవ‌రు ఏ పార్టీని గుర్తించ‌లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేత‌లు మ‌రీ సిగ్గు విడిచి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల‌కు చెందిన కొంద‌రు నేత‌లు… ఎవ‌రు ఏ పార్టీని గుర్తించ‌లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ముఖ్యంగా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేత‌లు మ‌రీ సిగ్గు విడిచి న‌డుచుకుంటున్నార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. వైఎస్సార్ జిల్లాకు చెందిన బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సీఎం ర‌మేశ్‌నాయుడు ఇంట్లో ఒక్కొక్క‌రు ఒక్కో పార్టీ. ర‌మేశ్ నాయుడి అన్న సురేష్‌నాయుడు ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్నారు.

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కోసం ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్రొద్దుటూరులో అన్నా క్యాంటీన్ నిర్వ‌హిస్తూ టీడీపీ పెద్ద‌ల మ‌న్న‌న‌లు పొందేందుకు త‌న వంతు ప్ర‌య‌త్నాలు సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సీఎం ర‌మేశ్‌నాయుడు క‌డ‌ప జిల్లాలో టీడీపీ, ఢిల్లీలో బీజేపీ అన్న‌ట్టుగా న‌డుచుకుంటున్నార‌నే విమ‌ర్శ వుంది.

పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ ర‌వి విష‌యంలో ఆ పార్టీ నాయకుల కంటే ఆయ‌నే ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. బీటెక్ ర‌విని జైల్లో ర‌మేశ్ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ బీటెక్ ర‌విని కిడ్నాప్ చేశార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఈ ఆరోప‌ణ‌ను క‌డ‌ప ఎస్పీ ఖండించారు. త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తే లీగ‌ల్ ఇస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఈ నేప‌థ్యంలో సీఎం ర‌మేశ్‌నాయుడు మ‌రోసారి శ‌నివారం బీటెక్ ర‌వి విష‌య‌మై మీడియాతో మాట్లాడారు. బీటెక్ ర‌వి అరెస్ట్‌కు సంబంధించి ఆరోప‌ణ‌పై త‌మ ద‌గ్గ‌ర ఆధారాలున్నాయ‌న్నారు. బీటెక్‌ రవిని నిర్బంధించ‌లేద‌ని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్ర‌మాణం చేస్తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న‌పై ఎస్పీ ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌బ‌బు కాద‌న్నారు. బీటెక్ రవి అరెస్ట్ తీరుపై త‌మ‌ దగ్గర అన్ని ఆధారాలూ ఉన్నాయన్నారు. ఆధారాలతో కేంద్రహోమ్ శాఖకు ఫిర్యాదు చేశానన్నారు.  

ఇదిలా వుండ‌గా టీడీపీ నాయ‌కుడి వ‌లే సీఎం ర‌మేశ్ మాట్లాడ్డంపై బీజేపీ శ్రేణులు కూడా ఆశ్చ‌ర్య‌పోతున్నాయి. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌యోజ‌నాల కోస‌మే ప‌నిచేస్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లే బ‌హిరంగంగా విమ‌ర్శిస్తున్న ప‌రిస్థితి. పురందేశ్వ‌రి బాట‌లో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నేత‌లు కూడా నిస్సిగ్గుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. 

టీడీపీపై ప్రేమ చంపుకోలేక‌పోతుంటే, ఆ పార్టీలోనే చేరొచ్చు క‌దా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. బీజేపీలో వుంటూ చంద్ర‌బాబునాయుడి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ప‌ని చేయ‌డం ఏంట‌నే నిల‌దీత జాతీయ పార్టీ నుంచి ఎదుర‌వుతోంది.