ఇలా మాట్లాడితే బీజేపీకి ఓట్లు ప‌డిపోతాయా!

ఎన్నిక‌ల స‌మ‌యాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు చాలా చిత్రాచిత్రంగా ఉంటాయి. ప్ర‌జ‌ల్లో ఏదో ర‌కంగా భావోద్వేగాలు రేపి ప‌ని పూర్తి చేసుకోవాల‌నే ఆరాటం క‌మ‌ల‌నాథుల్లో దాస్తే దాగేది కాదు. వారి మాటల్లో…

ఎన్నిక‌ల స‌మ‌యాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు చాలా చిత్రాచిత్రంగా ఉంటాయి. ప్ర‌జ‌ల్లో ఏదో ర‌కంగా భావోద్వేగాలు రేపి ప‌ని పూర్తి చేసుకోవాల‌నే ఆరాటం క‌మ‌ల‌నాథుల్లో దాస్తే దాగేది కాదు. వారి మాటల్లో అది ఎప్పుడూ బ‌య‌ట‌ప‌డుతూనే ఉంటుంది. దీనికి బోలెడ‌న్ని ఉదాహ‌ర‌ణ‌లు. 

2014 ఎన్నిక‌ల పోలింగ్ రోజున అప్ప‌టి బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా ఓటేసి వ‌చ్చిన త‌ర్వాత న‌రేంద్ర‌మోడీ త‌న మెడ‌లో వేసుకున్న క‌మ‌లం గుర్తు డాల‌ర్ ను మీడియా ముందు ప్ర‌ద‌ర్శించారు, ఒక పొడ‌వాటి దండ వేసుకుని, దానికి క‌మ‌లం డాల‌ర్ ను త‌గిలించుకుని, మోడీ మీడియా ముందు దాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ తెగ హ‌డావుడి చేశారు! 

ఎన్నిక‌ల పోలింగ్ రోజున అలాంటి చ‌ర్య‌లు అధికారికంగా నిషేధం. పోలింగ్ కు ముందు రోజే ప్ర‌చారం నిషేధం. అయితే మోడీ త‌ను ఓటేసి బ‌య‌ట‌కు వ‌చ్చి, దేశ‌మంతా మీడియాలో లైవ్ టెలికాస్ట్ అవుతుండ‌గా.. మెడ‌లో త‌న పార్టీ గుర్తును చూపి హ‌డావుడి చేశారు! అప్ప‌టికీ మోడీ అనుకూల వేవ్స్ వీస్తున్నాయి. అలాంటి స‌మ‌యంలో కూడా మోడీ అలా చేయ‌డం అభినంద‌నీయం అనిపించుకోలేదు! అయిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాత ఎన్నిక‌ల రాజ‌కీయం అయితే క‌మ‌లం పార్టీ త‌ర‌ఫున ఎక్క‌డా ఆగ‌డం లేదు!

ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌కు ప్ర‌ధాన‌మంత్రి, కేంద్ర‌మంత్రులు త‌ర‌చూ పర్య‌ట‌న‌లు పెట్టుకుంటారు. ఆ మ‌ధ్య క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విష‌యంలో అయితే మోడీ దాదాపు ఏడాదికి ముందు నుంచి ఆ రాష్ట్రం చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టారు. అలా ఎన్నిక‌లు ఏ రాష్ట్రంలో జ‌రుగుతుంటే దాని చుట్టూరానే ఎక్కువ తిరుగుతూ, అక్క‌డ అన్ని శంఖుస్థాప‌న‌లు చేస్తూ, ఆ రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు ఎంత కావాలంటూ.. ప్ర‌సంగాలు చేస్తూ పూర్తి ఎన్నిక‌ల రాజ‌కీయ‌మే చేస్తున్నారు. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎన్నిక‌ల స‌మ‌యాల్లో ర‌క‌ర‌కాల భావోద్వేగాల‌ను రేపే ప్ర‌య‌త్నమూ నిక్షేపంగా జ‌రుగుతున్న‌దే. మ‌త‌ప‌ర‌మైన అంశాల‌ను ప్ర‌స్తావించ‌డం, మ‌త భావోద్వేగాల‌ను రేకెత్తించే ప్ర‌య‌త్న‌మూ జ‌రుగుతుంటుంది. 

కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే మోడీ కేర‌ళ స్టోరీ అనే సినిమా గురించి ప్ర‌స్తావించారు. ఆ సినిమాను చూడాల‌ని ప్ర‌మోట్ చేశారు! త‌ప్పుల‌, త‌డ‌క‌గా తీశార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న సినిమాను చూడ‌మ‌ని ప్రోత్స‌హించ‌డం ద్వారా మోడీ చెప్ప‌ద‌లుచుకున్న‌ది ఏమిటో అర్థం కాని వాళ్లు ఎవ‌రు?

అవే అనుకుంటే.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ మ‌రో మాట సెల‌విచ్చారు. అదేంటంటే.. టీమిండియా క్రికెట్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో ఓడిపోవ‌డంపై దేశ‌మంతా బాధ‌ప‌డింద‌ట‌, ప్ర‌ధాని మోడీ కూడా బాధ‌ప‌డ్డార‌ట‌, ఇలా దేశం యావ‌త్తూ క‌న్నీరుమున్నీరు అవుతుంటే.. ఇండియా ఓడిపోవ‌డం ప‌ట్ల రాహుల్ గాంధీ, ప్రియాంక‌లు మాత్రం ఆనందించార‌ట‌! ఇదీ ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇచ్చిన స్టేట్ మెంట్. త‌న రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రుగుతున్న వేళ‌.. ఒక ముఖ్య‌మంత్రి ఇలా మాట్లాడుతున్నారు!

ఆఖ‌రికి ప్ర‌పంచ‌క‌ప్ ఓట‌మిని కూడా రాజ‌కీయంగా వాడుకుంటూ, క్యాష్ చేసుకోవాల‌నే ప్ర‌య‌త్నం క‌మ‌ల‌నాథుల‌కే సాధ్యం అనుకోవాలి! ఒక‌వేళ గెలిచి ఉంటే ఎలా వాడుకునే వారో! మోడీనే ద‌గ్గ‌రుండి గెలిపించార‌నో, లేదా బీజేపీ అధికారంలో ఉండ‌టం వ‌ల్ల‌నే ఇండియా గెలిచింద‌నో ప్ర‌చారం చేసుకునే వాళ్లు. అయితే.. ఓడిపోయింది కాబ‌ట్టి, అంతా బాధ‌ప‌డ్డారు కాబ‌ట్టి, ఇదే స‌మ‌యంలో రాహుల్, ప్రియాంక‌లు ఆనంద‌ప‌డ్డార‌ని అన‌డం ద్వారా ఓట్ల‌ను పొందాల‌ని ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎత్తుగ‌డ వేస్తున్న‌ట్టుగా ఉన్నారు!

ఇండియా ఓడిపోగానే రాహుల్ గాంధీ, ప్రియాంక‌లు ఎక్క‌డైనా ఆనందంతో గంతులు వేశారా? లేదా త‌మ ఆనందాన్ని ఎక్క‌డైనా చాటుకున్నారా! ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఇలా ఎలా మాట్లాడ‌గ‌లుగుతారో  మ‌రి. అయితే ఎలా శివ‌రాజ్ సింగ్ చౌహాన్ ఇలాంటి ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు కాబ‌ట్టి, భ‌క్తులు అందుకు ఆధారాల‌ను కూడా స‌మ‌ర్పించ‌గ‌ల‌రు. 

ఎక్క‌డైనా రాహుల్ గాంధీ పార్టీలోనో, సంబ‌రాల్లోనో ఉన్న ఫొటోల‌ను, వీడియోల‌ను తీసుకొచ్చి.. ఇండియా ఓడిపోయిన రాత్రి రాహుల్ పార్టీ చేసుకున్నాడ‌నే ప్ర‌చారాన్ని కూడా వారు ఎంచ‌క్కా చేయ‌గ‌ల‌రు! అలాంటి నెట్ వ‌ర్క్ అయితే భ‌క్తుల రూపంలో ఆ పార్టీకి గ‌ట్టిగానే ఉంది. మ‌రి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చి, తాము ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డం ద్వారా గ‌త మూడున్న‌రేళ్ల‌లో త‌న రాష్ట్రానికి ఉద్ద‌రించింది ఏమిటో చెప్పి.. ఓటు అడ‌గాల్సిన హోదాలోని వ్య‌క్తి.. వ‌ర‌ల్డ్ క‌ప్ ఓట‌మితో రాహుల్, ప్రియాంక‌ల సంబ‌రాలు అంటూ మాట్లాడుతూ.. త‌మ దేశ‌భ‌క్తిని చాటుకుంటూ ఉండ‌టం శోచ‌నీయం!