ప్రియాంక‌గాంధీ రోడ్ షోలో టీడీపీ జెండాల రెప‌రెప‌లు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు టీడీపీ అండ‌గా నిలిచింద‌నేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ‌. ఖ‌మ్మం జిల్లా పాలేరులో ప్ర‌స్తుతం కాంగ్రెస్ అగ్ర‌నాయకురాలు ప్రియాంక‌గాంధీ రోడ్ షో చేప‌ట్టారు. ఈ షోలో తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు టీడీపీ అండ‌గా నిలిచింద‌నేందుకు మ‌రో ఉదాహ‌ర‌ణ‌. ఖ‌మ్మం జిల్లా పాలేరులో ప్ర‌స్తుతం కాంగ్రెస్ అగ్ర‌నాయకురాలు ప్రియాంక‌గాంధీ రోడ్ షో చేప‌ట్టారు. ఈ షోలో తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు భ‌ట్టి విక్ర‌మార్క‌, పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పాల్గొన్నారు. పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పొంగులేటి బ‌రిలో నిలిచిన సంగ‌తి తెలిసిందే.

ప్రియాంక గాంధీ రోడ్ షోలో కాంగ్రెస్‌, సీపీఐతో పాటు టీడీపీ జెండాలు రెప‌రెప‌లాడ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ త‌ర‌పున ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నాయి. ప్రియాంక గాంధీ రోడ్‌లో ప‌సుపు జెండాలు ఎక్కువ సంఖ్య‌లో క‌నిపించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ చేయ‌డం లేదు. అలాగే ఏ పార్టీకి అధికారికంగా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు.

కానీ చంద్ర‌బాబును తెలంగాణ సీఎం కేసీఆర్‌, ప్ర‌ధాని మోదీ ఇబ్బంది పెడుతున్నార‌నే అభిప్రాయంలో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ద్వారా బీఆర్ఎస్‌, బీజేపీకి గ‌ట్టిగా బుద్ధి చెప్పాల‌నే త‌లంపులో టీడీపీ నేత‌లున్నారు. అందుకే అన‌ధికారికంగా కాంగ్రెస్‌కు బ‌హిరంగంగానే టీడీపీ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో పాటు ప్ర‌చారంలో కూడా పాల్గొన‌డం విశేషం.

పాలేరులో క‌మ్మ సామాజిక వ‌ర్గం ఓట్లు భారీగానే వున్నాయి. ఈ ఓట్ల‌న్నీ ఇంత వ‌ర‌కూ టీడీపీ, ఆ త‌ర్వాత బీఆర్ఎస్‌కు ప‌డుతూ వ‌చ్చాయి. కానీ మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల్లో టీడీపీ అనుకూల ఓట్లు కాంగ్రెస్ వైపు టర్న్ తీసుకున్నాయ‌నే చ‌ర్చ న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో ప్రియాంక రోడ్ షోలో ప‌సుపు జెండాలు క‌నిపించ‌డం బీఆర్ఎస్‌, బీజేపీల‌కు షాక్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.