ఇటీవల కాలంలో బాగా చర్చ జరుగుతున్న అంశం.. ఫేక్ డీపీ. దీనికి ప్రధాని మోదీ కూడా బాధితుడే. సాంకేతిక పరిజ్ఞానాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదు. ఎవరినైనా బద్నాం చేయాలంటే ఫేక్ డీపీలను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే సరిపోతుందనే దుర్మార్గ ఆలోచన కొంత మందిలో వుంది.
మరీ ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇలాంటివి తెరపైకి రావడం చర్చనీయాంశమైంది. ఈ విషయమై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా తన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయడం గమనార్హం. ఓటింగ్‌కు సమయం దగ్గరపడుతున్న తరుణంలో డీప్ ఫేక్‌లపై అప్రమత్తంగా వుండాలని తన పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌ను ఆయన హెచ్చరించారు. ఓటమి అంచున్న ఉన్న స్కాంగ్రెస్ డీప్ ఫేక్‌ల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.
బీఆర్ఎస్ సైనికులు అప్రమత్తంగా వుండి ఓటర్లను చైతన్యపరచాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ ఫేక్ డీప్ మహిళలకూ మాత్రమే కాకుండా రాజకీయ నేతలకు కూడా ప్రమాదమే అని ఆయన హెచ్చరించారు. ప్రతిపక్షాలు ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ తమపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆయన మండిపడ్డారు.
నల్సార్‌తో కలిసి సైబర్ క్రైమ్ లెజిస్లేషన్ను తయారు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నట్టు కేటీఆర్ తెలిపారు. మహిళలు తమ వివరాలు చెప్పకుండానే ఫిర్యాదులు చేయవచ్చని ఆయన సూచించారు. ప్రతిపక్షాలకు కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని తెలుసని, కానీ వారు నటిస్తున్నారని ఆయన విమర్శించారు.