సీపీఐ జాతీయ నాయకుడు కె.నారాయణ ఎప్పుడెలా మాట్లాడ్తారో ఆయనకే తెలియదు. ఒక్కోసారి నోటికొట్టినట్టు మాట్లాడి క్షమాపణలు చెప్పిన ఉదంతాలు ఎన్నో. అలాగే పార్టీ పెద్దలతో చీవాట్లు తిన్న సందర్భాలు కూడా లేకపోలేదు. నారాయణ బోలా మనిషి. నారాయణకు కమ్యూనిజంపై కంటే సొంత కులంపై అభిమానం ఎక్కువనే కామెంట్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు.
చంద్రబాబుపై నారాయణకు గల ప్రత్యేకాభిమానం బహిరంగమే. ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన నాయకులే. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ ఆయన్ను తీవ్రంగా బాధించింది. బీజేపీతో అంటకాగుతున్న చంద్రబాబుతో కమ్యూనిజం సిద్ధాంతానికి వ్యతిరేకంగా జతకట్టడానికి నారాయణ ఏ మాత్రం వెనుకాడడం లేదు. బాబు విషయంలో పార్టీ సిద్ధాంతం కంటే ఇతరత్రా అంశాలే ఎక్కువగా పని చేస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కేంద్ర మంత్రి అమిత్‌షా వల్లే చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని ఆయన సంచలన కామెంట్ చేశారు. చంద్రబాబు మళ్లీ ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చని ఆయన జోస్యం చెప్పారు. చంద్రబాబుది అన్ అఫీషియల్ కండీషన్ బెయిల్ అని చెప్పుకొచ్చారు.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను లోకేశ్ కలిసిన తర్వాతే పరిణామాలు మారాయని ఆయన అన్నారు. ఏపీలో తాము టీడీపీతో కలవాలని అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అయితే టీడీపీ పక్క చూపులు చూస్తోందని విమర్శించారు. బీజేపీతో టీడీపీని కలిపేందుకు పవన్‌కల్యాణ్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఆయన తప్పు పట్టారు.