పవన్ కల్యాణ్: ఇక్కడో నాలుక.. అక్కడో నాలుక!

తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకోసం సాధించేది ఏముంటుందో తెలియదు గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన అవకాశాలను కురచగా మార్చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.…

తెలంగాణలో మాత్రం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీకోసం సాధించేది ఏముంటుందో తెలియదు గానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన అవకాశాలను కురచగా మార్చేసుకున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలో ప్రచారం ప్రారంభించిన తర్వాత.. ఆ విషయాన్ని ఆయన మరోమారు ధ్రువీకరించే తరహాలో వ్యవహరిస్తున్నారు. 

ఏరోటికాడ ఆ పాట పాడినట్టుగా.. తెలంగాణ ఎన్నికల సమయంలో అందుకు అనుకూలమైన మాటలు నాలుగు మాట్లాడి వెళ్లిపోతే సరిపోతుందని ఆయన అనుకుంటూ ఉండవచ్చు గానీ.. ఈ మాటల ప్రభావం.. ఏపీ ఎన్నికల మీద కూడా పడుతుందనే సంగతి ఆయన మర్చిపోతున్నారు. ఈ మాటలను పట్టుకుని ఏపీలో రాజకీయ ప్రత్యర్థులు తనని ఒక ఆట ఆడుకోగలరనే వాస్తవాన్ని ఆయన విస్మరిస్తున్నారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ ఏం అంటున్నారంటే.. కేసీఆర్, రేవంత్ రెడ్డి కూడా తనకు బాగా పరిచయం అని చెబుతున్నారు. అయితే ప్రధానిగా నరేంద్రమోడీ చాలా చక్కటి పరిపాలన అందిస్తున్నారని, రాష్ట్రం ముందుకు నడవాలంటే.. డబుల్ఇంజిన్ సర్కార్ అవసరం అని ఆయన అంటున్నారు. ఇలా రాష్ట్రం ముందకు నడవడం అనేది తెలంగాణ వరకు మాత్రమే పరిమితమా.. ఏపీ కూడా ముందుకు నడవాలనే కోరిక ఆయనకు లేదా అనేది ఇక్కడ కీలకమైన అంశంగా ఉంది.

తెలంగాణలో బిజెపితో పొత్తులు పెట్టుకుని 8 సీట్లు దక్కించుకుని బరిలోకి దిగిన పవన్ కల్యాణ్.. కనీసం ఆ 8 స్థానాలకు అభ్యర్థులు కూడా తనకు సొంతంగా లేరనే బలహీనతను చాటుకున్నారు. పొత్తులు ఖరారైన తర్వాత.. పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇచ్చి జనసేన యొక్క గతిలేని తనాన్ని ప్రజల ఎదుట నిరూపించారు. వారికోసం ఇప్పుడు మళ్లీ తగుదునమ్మా అంటూ ప్రచారం చేస్తున్నారు.

అయితే ఏపీ ఎన్నికల విషయం వచ్చేసరికి అక్కడ చంద్రబాబునాయుడు అనుభవం చాలా అవసరం అని, ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఈ పోకడ జనసేన పార్టీకి ప్రమాదకరం అని ఆ పార్టీ నాయకులే అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో బిజెపి భజనచేస్తూ, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా మాత్రమే రాష్ట్రం ముందుకు వెళుతుందని అంటూ.. ఏపీలో మాత్రం బిజెపిని కాలదన్ని చంద్రబాబు భజన చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారనేది వారి అనుమానం. అక్కడ తెలుగుదేశంతో పొత్తుకు బిజెపి లొంగి వచ్చేలా కనిపించడం లేదు. అప్పుడు పవన్ ఏం చేస్తారు. తెలుగుదేశం కూటమి ప్రచారం చేస్తూ.. అక్కడ మాత్రం బిజెపికి ఓటు వేయవద్దని చెప్పే ధైర్యం ఆయనకు ఉందా.. అనేది పలువురికి కలుగుతున్న సందేహంగా ఉంది.