తెలంగాణ రాష్ట్రంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి.. తాను అధికారంలోకి వస్తానని నిరుద్యోగులకు న్యాయం చేస్తానని భీషణ ప్రతిజ్ఞలతో దాదాపుగా రాష్ట్రమంతా పాదయాత్రలు కూడా నిర్వహించిన వైఎస్ షర్మిల.. సరిగ్గా ఎన్నికలు కాకమీదికి వచ్చిన తర్వాత.. ఏరీ ఎక్కడ?
తెలంగాణ ప్రచార పర్వంలో ఆమె అస్సలు కనిపించడం లేదేమిటి? కేసీఆర్ మీద, ఆయన కుటుంబ పాలన మీద సుదీర్ఘకాలంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆమె ఇలాంటి కీలక సమయంలో అంత సైలెంట్ గా ఎలా ఉండగలుగుతున్నారు? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.
కాంగ్రెసులో తన వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేయడానికి చివరి వరకు ప్రయత్నించి.. విఫలమైన షర్మిల ఒక ప్రెస్ మీట్ పెట్టి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. కేసీఆర్ పతనం కోసం, వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తమ పార్టీ ఎన్నికల్లో పోటీచేయడం లేదని కూడా అన్నారు. కాంగ్రెసు పార్టీకి పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటిస్తున్నట్టుగా కూడా ఆమె వెల్లడించారు.
పూర్తిస్థాయి మద్దతు అంటే ఏమిటి? ఆరోజు ప్రెస్ మీట్ లో మద్దతు ప్రకటించిన తర్వాత.. షర్మిల మళ్లీ ఇప్పటిదాకా కనిపించలేదు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా పాల్గొన లేదు. కాంగ్రెసు నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆమెకు ఇబ్బందిగా ఉండేట్లయితే.. కనీసం కేసీఆర్ వ్యతిరేక గళాన్ని ఇతర మాధ్యమాల ద్వారా కూడా వినిపించడం లేదు.
సోషల్ మీడియాలో కూడా చప్పుడు చేయడం లేదు. వైతెపా క్రియాశీలంగా ఉన్న రోజుల్లో షర్మిల సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉండేవారు. ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అందుకే షర్మిల మద్దతు అనేది కేవలం ఒక్క ప్రెస్ మీట్ కు మాత్రమే పరిమితమా? అనే మాట ప్రజల్లో వినిపిస్తోంది.
షర్మిలను ప్రచారంలో వాడుకోకుండా కాంగ్రెసు పార్టీ వ్యూహాత్మకంగా పక్కన పెట్టిందని అనుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే కోదండరాం సంగతేమిటి? అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. తెలంగాణ జనసమితి (తెజస) వ్యవస్థాపక సారథిగా ప్రొఫెసర్ కోదండరాం ఈ ఎన్నికల్లో తలపడి ఉండగల అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకభూమిక పోషించిన సంధాన కర్తగా ఆయనకు ఎప్పటికీ కీర్తి ఉంటుంది.
అయితే ఎన్నికల్లో పోటీచేయకుండా కాంగ్రెసుకు మద్దతు ప్రకటించిన కోదండరాం కూడా ఎక్కడా ప్రచాంరలో కనిపించడం లేదు. పార్టీ గెలిచిన తర్వాత కల్పించగల అవకాశాల గురించి ఆయనకు కాంగ్రెసు గట్టి గానే హామీలిచ్చింది. కానీ ప్రచారంలో మాత్రం ఎందుకు వాడుకోవడం లేదో అని ప్రజలు అనుకుంటున్నారు.