Robinhood Review: మూవీ రివ్యూ: రాబిన్ హుడ్

కొన్ని అర నవ్వులు, మరికొన్ని ట్విస్టులు, శ్రీలీల అందాల కోసం మాత్రమే ఈ రాబిన్ హుడ్.

చిత్రం: రాబిన్ హుడ్
రేటింగ్: 2.5/5
తారాగణం: నితిన్, శ్రీలీల, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, షైన్ టామ్ చాకో, బ్రహ్మాజీ తదితరులు..
కెమెరా: సాయిశ్రీరామ్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాత: నవీన్ ఏర్నేని, రవిశంకర్
దర్శకత్వం: వెంకీ కుడుముల
విడుదల: మార్చి 28, 2025

భీష్మ కంటే 10 రెట్లు ఎక్కువ కంటెంట్, కామెడీ ఉంటుందని స్వయంగా నితిన్ ప్రకటించిన సినిమా. క్లీన్ కామెడీ ఉంటుందని స్వయంగా దర్శకుడు, హీరోయిన్ చెప్పిన సినిమా. నితిన్ కమ్ బ్యాక్ మూవీ అంటూ మేకర్స్ ఊదరగొట్టిన సినిమా. దీనికితోడు “అదిదా సర్ ప్రైజు” అంటూ వివాదాస్పద డాన్స్ బిట్ ఉన్న సినిమా. ఇలా కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉన్న రాబిన్ హుడ్ ఈరోజు రిలీజైంది. మరి వీళ్లంతా చెప్పిన రేంజ్ లో సినిమా ఉందో లేదో చూద్దాం..

రామ్ అలియాస్ రాబిన్ హుడ్ (నితిన్) చిన్నప్పట్నుంచే దొంగగా మారతాడు. తన తెలివితేటలతో ధనవంతుల నుంచి డబ్బులు దొంగిలించి అనాథ శరణాలయాలకు విరాళాలు ఇస్తుంటాడు. మరోవైపు కరడుగట్టిన విలన్ రుద్రకొండ గ్రామాన్ని అక్రమించి, అక్రమంగా గంజాయి సాగు చేస్తుంటాడు. తన వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనుకుంటాడు. ఇంకోవైపు ఆస్ట్రేలియాలో ఉన్న వాసుదేవ్ కుమార్తె రీనా (శ్రీలీల) తాతను చూసేందుకు ఇండియా వస్తుంది. ఈ 3 పాత్రలు ఆ గ్రామంలో ఎలా కలిశాయి, చివరికి ఏమైందనేది స్టోరీ.

ఈ కథ ఇలా సగం చెప్పినా, మిగతాదంతా విడమర్చి చెప్పినా పెద్ద తేడా ఉండదు. సినిమా మొదలైన 15 నిమిషాలకే ఎండింగ్ ఎలా ఉంటుందో ప్రేక్షకుడు ఇట్టే ఊహించుకోవచ్చు. కేవలం క్లైమాక్స్ మాత్రమే కాదు, ప్రతి సన్నివేశాన్ని ఎంచక్కా ముందే ఊహించుకోవచ్చు. అదిదా సర్ ప్రైజు.

ఇలాంటి తీసికట్టు కథలతో సినిమాలు తీసినప్పుడు ఉన్నతమైన ప్రొడక్షన్ విలువలు, నాణ్యమైన కామెడీ ఉండేలా జాగ్రత్తపడడం అత్యవసరం. ఇందులో మొదటి అంశంలో యూనిట్ సక్సెస్ అయింది. రెండో విభాగంలో మాత్రం ఫెయిలైంది. వెంకీ కుడుముల నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఈ సినిమాలో కామెడీ లేదు. ఆ మాటకొస్తే ట్రయిలర్ లో చూపించినవే బెస్ట్ కామెడీ సీన్లు అనుకోవాలి.

సినిమా ప్రారంభంలోనే కథ ఏంటనేది క్లారిటీగా తెలిసిపోతుంది. అనాథల కోసం దొంగగా మారిన ఓ హీరో కథ. ఇలాంటి కథలు కొండవీటి దొంగ సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం. కాబట్టి ట్రీట్ మెంట్ కచ్చితంగా కొత్తగా ఉండాలి. ఇక్కడే రాబిన్ హుడ్ ప్రేక్షకుల మనసులు దొంగిలించలేకపోయాడు. రొటీన్ సన్నివేశాలు, అర నవ్వు పుట్టించే కామెడీతోనే బండి లాగించాడు దర్శకుడు. మొత్తానికి ఊరిని కాపాడ్డమనే మిషన్ తో ఇంటర్వెల్ బ్యాంగ్ వేశాడు.

మొదటి అర్థభాగంలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కామెడీ తప్ప చెప్పుకోడానికేం కనిపించలేదు. ఏదో కథ నడుస్తున్న భావన. హీరో ఏదో చేస్తున్నాడనే ఫీలింగ్ వస్తుంది తప్ప కథతో కనెక్షన్ ఏర్పడదు. బాధాకరమైన విషయం ఏంటంటే, సెకండాఫ్ కూడా అలానే ఉంది. లాజిక్స్ కు దూరంగా తనకు ఎంతో అనుకూలంగా ఉండేలా సన్నివేశాలు రాసుకున్న దర్శకుడు, అంతే అనుకూలంగా క్లయిమాక్స్ ను కూడా ముగించాడు. బహుశా, ఈమధ్య కాలంలో ఇంత సిల్లీ క్లైమాక్స్ ఏ సినిమాలో చూడలేదు. మధ్యలో మరో 2-3 కామెడీ సీన్లు, చివర్లో డేవిడ్ వార్నర్. అంతే సినిమా.

ఈ సినిమాలో సన్నివేశాలు ఎంత సిల్లీగా ఉన్నాయంటే, గ్రామం మొత్తం సీక్రెట్ కెమెరాలు పెడతాడు విలన్. వాటిని అప్పటివరకు ఎవ్వరూ కనుక్కోలేకపోతారు. హీరో వచ్చి కనిబెట్టేసరికి విలన్ ఫిదా అయిపోతాడు. మరో సందర్భంలో విలన్ తో పాటు, రౌడీల అందరి ఫోన్లు హీరో హ్యాక్ చేస్తాడు. విలన్ బిక్కమొహం పెడతాడు, ఏం చేయాలో తెలియక కిందామీద పడతాడు. అలాంటోడు చివర్లో తను కూడా అపర మేధావిలా ప్రవర్తించి, తన తెలివితేటలు చూపిస్తాడు. ఇలా సెకెండాఫ్ మొత్తం ఒకటే ఫార్మాట్ లో వెళ్లింది. అప్పుడెప్పుడో వచ్చిన ‘కిక్’ సినిమా చూసిన ఫీలింగ్ కలిగించింది.

ఈ టామ్ అండ్ జెర్రీ స్క్రీన్ ప్లేలో కామెడీ పలచగా మారిపోయింది. ప్రేక్షకుడికి నీరసం ఆవహించింది. ఉన్నంతలో అదిదా సర్ ప్రైజు పాటతోనైనా తృప్తిపడదామంటే, ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. కేతిక శర్మ వేసిన వివాదాస్పద స్టెప్ ను కట్ చేశారు. ఈ సాంగ్ మాత్రమే కాదు, మిగతా పాటలన్నీ నాన్-సింక్ లోనే సాగాయి. పాటల కంపోజిషన్, పిక్చరైజేషన్ బాగున్నప్పటికీ సమయం-సందర్భం లేకుండా వచ్చిపోయాయి.

ఈ 3-4 కామెడీ సీన్ల సినిమాలో నితిన్ ఎప్పట్లానే తనకు అలవాటైన యాక్టింగ్ చేసుకుంటూ పోయాడు. ఫలానా సీన్ లో బాగా చేశాడని చెప్పుకోడానికేం లేదు, చేశాడంతే. హీరోయిన్ శ్రీలీల అందంగా ఉంది, పాటల్లో ఇంకా బాగుంది. ఆమెతో కూడా కామెడీ పండించడానికి దర్శకుడు పడిన తాపత్రయం అక్కడక్కడ కనిపించింది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ అక్కడక్కడ కామెడీ పండించారు. మైమ్ గోపీకి మంచి పాత్ర పడింది. షైన్ టామ్ చాకో మరోసారి పేలవమైన పాత్రలో కనిపించాడు. డేవిడ్ వార్నర్ క్రికెటర్‌గా చేసిన కెమియో సరదాగా అనిపించినా, కథకు అయితే పెద్దగా ప్రాముఖ్యత లేదు.

టెక్నికల్ గా చూసుకుంటే, సినిమాకు జీవీ ప్రకాష్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో మాత్రం అక్కడక్కడ మాత్రమే మెరిశాడు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఓకే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. రచయిత-దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాకు రొటీన్ కథనే తీసుకొని, దానికి తనదైన కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కథాపరంగా సినిమాలో ట్విస్టులు బాగానే పెట్టాడు కానీ కామెడీ విషయంలో మెప్పించలేకపోయాడు. ప్రేక్షకులు తన నుంచి ఆశించేది ట్విస్టులు కాదు, కామెడీ మాత్రమే అనే విషయాన్ని వెంకీ గుర్తుంచుకుంటే మంచిది.

మొత్తంగా చూసుకుంటే, పొట్టచెక్కలయ్యే కామెడీ ఆశించి రాబిన్ హుడ్ సినిమాకెళ్తే ఆశాభంగం తప్పదు. కొన్ని అర నవ్వులు, మరికొన్ని ట్విస్టులు, శ్రీలీల అందాల కోసం మాత్రమే ఈ రాబిన్ హుడ్.

బాటమ్ లైన్ – లేదుగా సర్ ప్రైజు

14 Replies to “Robinhood Review: మూవీ రివ్యూ: రాబిన్ హుడ్”

  1. అరేయ్ అందరూ మూవీ సూపర్ అంటున్నారు.. కామెడీ లేకపోతే సర్ప్రైజ్ లేనట్టా పనికిమాలినోడా…

  2. గ్రేట్ ఆంధ్ర రెడ్డి వెళ్లి ఒక సినిమా తీయరా …అది ఎంత కష్టమో తెలుస్తుంది

Comments are closed.