అబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్

అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఓడిపోయినప్పటి నుంచి మాత్రం వారి గురించి ఆలోచిస్తున్నారు.

అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్, ఓడిపోయినప్పటి నుంచి మాత్రం వారి గురించి ఆలోచిస్తున్నారు. తాజాగా, స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కార్యకర్తల పోరాటాన్ని పొగుడుతూ ఆయన ట్వీట్ చేశారు.

స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి పార్టీలకు ఎలాంటి బలం లేకపోయినా, చంద్ర‌బాబు గారు అధికార అహంకారాన్ని చూపి, పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసినా, కేసులు పెట్టినా, ఆస్తులు ధ్వంసం చేస్తామని, బంధువుల ఉద్యోగాలు తీసేస్తామని, జీవనోపాథి దెబ్బతీస్తామని భయపెట్టినా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా వాటన్నింటినీ బేఖాతరు చేస్తూ మన పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ధైర్యంగా నిలబడి వైయస్సార్‌కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించుకున్నారు. విలువలకు, విశ్వసనీయతకు పట్టం కడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టిన వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, నాయకులను చూసి గర్వపడుతున్నాను. క్లిష్ట సమయంలో వీరు చూపించిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చింది. ఈ ఎన్నికలను సమన్వయ పరుస్తూ గెలుపునకు బాటలు వేసిన వివిధ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్లు మరియు పార్టీ కేంద్ర కార్యాలయ సిబ్బంది అందర్నీ అభినందిస్తున్నాను. పార్టీకి అప్పుడూ, ఇప్పుడూ, ఎల్లప్పుడూ వెన్నుముకలా నిలుస్తున్న కార్యకర్తలకు నా హ్యాట్సాఫ్‌. అంటూ ట్వీట్ చేశారు.

టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ కార్యకర్తలపై, వారి ఆస్తులపై దాడులు చేస్తూ, రెడ్‌బుక్‌లో పేర్లను టార్గెట్ చేస్తూ అరెస్ట్ చేస్తున్నా, నిన్న జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ రకాలైన 50 స్థానిక సంస్థల స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా, కడప జడ్పీ ఛైర్మన్‌తో పాటు 18 ఎంపీపీలు, 12 వైస్ ఎంపీపీలు, 8 కోఆప్షన్ స్థానాల్లో వైసీపీ విజయం సాధించి, కూటమికి భారీ షాక్ ఇచ్చింది.

ఓడిపోయినప్పటి నుంచి కార్యకర్తలను కలవని జగన్, వారి తాజా పోరాటం చూసి ఆశ్చర్యపడి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధిష్టానం నుంచి సరైన మద్దతు లేకపోయినా, గట్టిగా నిలబడిన క్యాడర్‌కు జగన్ పూర్తి స్థాయిలో అండగా ఉంటే, టీడీపీ కూటమిని మరింత గట్టిగా ఎదుర్కొనే అవకాశం ఉందని కార్యకర్తలు భావిస్తున్నారు. ఇప్పటికైనా, తాడేపల్లి ప్యాలెస్‌లో కోటరీ మధ్య కూర్చోవడం మానించి, జిల్లాల్లో పర్యటించి కార్యకర్తలను కలుసుకుని, వారి సమస్యలను పరిష్కరిస్తే, వైసీపీకి మేలు జరిగే అవకాశం ఉంది.

3 Replies to “అబ్బో.. వైసీపీ కార్యకర్తలను పొగిడిన జగన్”

  1. నీకు కొఠారి తో పేచీ ఏంటో అర్ధం అవ్వడం లేదు వెంకట్రావు ..

    1. కోటరి లో స్థానం ఉండి ఉంటే కోటరి ఆహా ఓహో అని రాసేవారు మన జీఏగారు

Comments are closed.