ఇదిగో, అదిగో అంటూ మూడో దఫా నామినేటెడ్ పదవులపై కూటమి సర్కార్ ఊరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. ఇంకా మరికొన్ని మార్కెట్ కమిటీలకు చైర్మన్లను నియమించాల్సి వుంది. త్వరలో వాటిని కూడా భర్తీ చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
మార్కెట్ కమిటీ సభ్యుల్ని కూడా ప్రకటించాల్సి వుంది. ఇప్పటికి రెండు దఫాల్లో కూటమి సర్కార్ నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఫైబర్‌నెట్ చైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా కూడా చేసేశారు. ఫైబర్‌నెట్ ఎండీ , మరో ముగ్గురు ఉద్యోగుల అవినీతి బాగోతాన్ని ఆయన కడిగి పారేశారు. అయితే ఎలాంటి చర్యలు లేకపోవడంతో, ఆ పదవిలో ఉండడం ఎందుకులే అని ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు నామినేటెడ్ పదవికి కూడా రాజీనామా చేశారు.
పదవులు పొందిన ఇతర కార్పొరేషన్ల చైర్మన్ల పరిస్థితి కూడా ఏమంత గొప్పగా లేదని చెబుతున్నారు. అధికారులే పెత్తనం చేస్తూ, చైర్మన్ల మాటను ఖాతర చేయలేదని సమాచారం. దీంతో అలాంటి వాళ్లంతా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. చంద్రబాబునాయుడు పేరుకు పొలిటికల్ గవర్నెన్స్ అని చెబుతున్నప్పటికీ, ఆచరణలో అంత సీన్ లేదని అంటున్నారు.
పూర్తిగా పరిపాలనను అధికారులు తమ చేతుల్లోకి తీసుకుని, తమపై స్వారీ చేస్తున్నారనేది నామినేటెడ్ పదవులు పొందిన వాళ్ల విమర్శ. ఏది ఏమైనప్పటికీ మూడో విడతలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు దక్కడం, కొందరినైనా సంతోషపెడుతుంది.