MAD Square Review: మూవీ రివ్యూ: మ్యాడ్ స్క్వేర్

లాజిక్ లేని ఫన్ కోసం మ్యాడ్ స్క్వేర్ ను ఓసారి చూడొచ్చు

చిత్రం: మ్యాడ్ స్క్వేర్
రేటింగ్: 2.5/5
తారాగణం: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు, సత్యం రాజేశ్, సునీల్, మురళీధర్ గౌడ్ తదితరులు
సంగీతం: భీమ్స్
ఎడిటింగ్: నవీన్ నూలి
కెమెరా: షామ్ దత్
నిర్మాత: నాగవంశీ
దర్శకత్వం: కల్యాణ్ శంకర్
విడుదల: మార్చి 28, 2025

మ్యాడ్ లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది మ్యాడ్ స్క్వేర్. మొదటి భాగానికి ఏమాత్రం తీసిపోని విధంగా, ఇంకా చెప్పాలంటే, ఇంకాస్త ఎక్కువే ఫన్ ఉంటుందని, సరదాగా నవ్వుకోవచ్చని నిర్మాత నాగవంశీ ఊరించాడు. నటీనటులు కూడా అదే చెప్పారు. మ్యాడ్ స్క్వేర్ ఎలా ఉందో చూద్దాం.

మ్యాడ్ గ్యాంగ్ లో ఒకడైన లడ్డూ (విష్ణు) పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తన ముగ్గురు ఫ్రెండ్స్ ను మాత్రం పెళ్లికి పిలవడు. ఆ విషయం తెలుసుకున్న MAD గ్యాంగ్ (మనోజ్, అశోక్, దామోదర్), పిలవకపోయినా లడ్డూ పెళ్లికి వెళ్తారు. అనుకోకుండా పెళ్లి ఆగిపోతుంది. అతడ్ని ఆ బాధ నుంచి బయటపడేసేందుకు అంతా కలిసి గోవా వెళ్తారు. అక్కడో దొంగతనం కేసులో ఇరుక్కుపోతారు. దాన్నుంచి వాళ్లు ఎలా బయటపడ్డారనేది మ్యాడ్ స్క్వేర్ స్టోరీ.

కథేంటి ఇంత సింపుల్ గా ఉందని అనుకుంటున్నారా? ఈ సినిమాను కథ కోసం, అందులో వచ్చే లాజిక్స్ కోసం చూడొద్దని నిర్మాత ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చాడు. కాబట్టి కథ గురించి చర్చ వద్దు, లాజిక్స్ ఉన్నాయా లేదా అనే పట్టింపు వద్దు. ప్రేక్షకుడు ఆశించిన, ఊహించిన స్థాయిలో కామెడీ ఉందా లేదా అనేది మాత్రమే చూద్దాం.

కామెడీ విషయంలో సీక్వెల్ గా రావడమే మ్యాడ్ స్క్వేర్ కు పెద్ద ప్రతిబంధకంగా మారింది. మ్యాడ్ తో కంపేర్ చేసుకొని చూస్తే, ఇందులో కామెడీ కాస్త తక్కువే అనిపిస్తుంది. అప్పటి ట్రెండ్ కు తగ్గట్టు అందులో కామెడీ కిక్కిచ్చింది. దీంతో ఇందులో కామెడీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

అలా భారీగా అంచనాలు పెట్టుకొని, ప్రతి సీన్ కు పగలబడి నవ్వేస్తాం అనుకొని థియేటర్లకు వెళ్తే మాత్రం కాస్త నిరాశ తప్పదు. ఎందుకంటే, సీక్వెల్ కూడా మొదటి సినిమా టెంప్లేట్ లోనే సాగింది. ఇనిస్టెంట్ పంచ్ లు, కామెడీ కోసం పెట్టిన సీన్లు కనిపిస్తాయి. వీటిలో కొన్ని బాగా నవ్విస్తే, మరికొన్ని ఓ మోస్తరుగా మెప్పించాయి.

మొదటి భాగంలో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో లడ్డూ చెప్పే ఫ్లాప్ బ్యాక్ తో సినిమా మొదలవ్వగా, ఈసారి తీహార్ సెంట్రల్ జైలులో లడ్డూ చెప్పే ఫ్లాష్ బ్యాక్ తో సీక్వెల్ మొదలవుతుంది. ఈసారి కామెడీ కోసం పెళ్లి కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. లడ్డూ పెళ్లి చుట్టూ అల్లుకున్న కొన్ని సీన్లు హిలేరియస్ గా ఉన్నాయి. మరికొన్ని మాత్రం బలవంతంగా ఇరికించినట్టు అనిపించాయి.

ఏదేమైనా పెళ్లి ఎపిసోడ్ వరకు ఓకే. ఆ తర్వాత వచ్చిన గోవా ఎపిసోడ్ లోనే కంప్లయింట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అక్కడ ఓ భారీ దొంగతనం, అది ఈ మ్యాడ్ గ్యాంగ్ కు చుట్టుకోవడం లాంటివి జరుగుతాయి. ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇక్కడ లాజిక్స్ కోసం వెదక్కుండా కామెడీ కోసం మాత్రమే వెదుక్కోవాలి. ఈసారి మాత్రం ఎంత వెదికినా కామెడీ కనిపించలేదు.

సినిమా అక్కడక్కడే తిరుగుతూ బలవంతపు కామెడీ కోసం కథను సాగదీసినట్టు అనిపించింది. నిజంగా ఇది 2 గంటల సినిమాయేనా అనే అనుమానం కూడా కలిగిందంటే సినిమా ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. పోలీస్ దుస్తుల్లో గ్యాంగ్ చేసే ఎపిసోడ్ లో పెద్దగా కామెడీ పండకపోగా చిరాకు తెప్పించింది. దీనికితోడు కొన్ని డైలాగ్స్ సెన్సార్ అవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సినిమా మరీ 2 గంటలైనా లేకపోతే బాగోదన్నట్టు కొన్ని ట్రాక్స్ ను పొడిగించారు, పాటలు కూడా ఎక్కువే పెట్టారు. అవి కూడా లేకపోతే సినిమా గంటన్నరలో ముగిసేది. అయితే ఇవన్నీ పెట్టడం వల్ల అప్పటివరకు బాగా పేలిన కొన్ని జోకులు, మరికొన్ని పంచ్ లు ప్రేక్షకుడి మైండ్ నుంచి కనుమరుగయ్యాయి. మొత్తానికి ఓ చిన్న ట్విస్ట్ తో సినిమాను ముగించి, పనిలోపనిగా పార్ట్-3 కూడా ఉందని ప్రకటించుకున్నారు.

ఎప్పట్లానే సీక్వెల్ లో కూడా సంగీత్ శోభన్, విష్ణు ఫ్రంట్ సీట్ తీసుకున్నారు. ఎక్కువగా వీళ్లిద్దరే కామెడీ పండించారు. నార్నే నితిన్, రామ్ నితిన్ కూడా మధ్యమధ్యలో పంచ్ లు వేశారు. సునీల్ కామెడీ 2 సన్నివేశాల్లో మాత్రమే మెరవగా, శుభలేఖ సుధాకర్ తో కూడా కామెడీ పండించాలనే ఎత్తుగడ పనిచేయలేదు. సత్యం రాజేశ్, అనుదీప్ కేవీ కామెడీ పేలలేదు. స్వాతిరెడ్డిగా రెబా మోనిక మెరవగా, హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ ఓకే. ఎప్పట్లానే మురళీధర్ గౌడ్, రఘుబాబు అక్కడక్కడ తమ చమక్కులు చూపించారు.

టెక్నికల్ గా సినిమాలో చెప్పుకోడానికేం లేదు. భీమ్స్ మ్యూజిక్ బాగుంది. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం సినిమాను ఇంకా తగ్గించొచ్చేమో అనిపించింది. చేసింది చిన్న సినిమానే అయినప్పటికీ క్వాలిటీ విషయంలో రాజీపడలేదు నిర్మాణ సంస్థ ‘సితార’.

ఓవరాల్ గా చూసుకుంటే లాజిక్ లేని ఫన్ కోసం మ్యాడ్ స్క్వేర్ ను ఓసారి చూడొచ్చు. అక్కడక్కడ బలవంతంగా నవ్వాల్సి వచ్చినా ఇబ్బంది పడకుండా, “కథతో మనకేంటి పని” అని పదేపదే మనసుకు సర్దిచెప్పుకొని చూడాల్సిన సినిమా ఇది.

బాటమ్ లైన్ – ‘మ్యాడ్’ కామెడీ

3 Replies to “MAD Square Review: మూవీ రివ్యూ: మ్యాడ్ స్క్వేర్”

Comments are closed.