వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగి వారం అయినా గడవకముందే ఇండియా, ఆస్ట్రేలియాల మధ్యన మరో మ్యాచ్ జరిగింది. ఇది టీ20. ఐదు టీ20 మ్యాచ్ ల సీరిస్ లో భాగంగా వైజాగ్ లో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఆఖరి బంతికి విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 208 పరుగులు చేసింది.
జోస్ ఇంగ్లిస్ 50 బంతుల్లో 110 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. స్మిత్ హాఫ్ సెంచరీతో ఆస్ట్రేలియా స్కోరు రెండు వందల పరుగులను దాటేసింది. దాదాపు ద్వితీయ శ్రేణి జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా ఈ భారీ స్కోరును చేధించడం గమనార్హం.
ఈ సీరిస్ కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో స్కైపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే వాటిని ఇతడేమాత్రం అందుకోలేకపోయాడు. ఇంతలోనే కెప్టెన్సీ దక్కింది. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం ఇతడు బాగా ఆడాడు. 42 బంతుల్లో 80 పరుగులు చేశాడు సూర్యకుమార్ యాదవ్. యశస్వి జైశ్వాల్ 8 బంతుల్లో 21, ఇషాన్ కిషన్ 39 బంతుల్లో 58, రింకూ సింగ్ 14 బంతుల్లో 22, లు భారత విజయానికి బాటలు వేశారు.
ఆఖరి ఓవర్లో ఎనిమిది పరుగులు చేయాల్సిన దశలో టీమిండియా వరసగా వికెట్లను కోల్పోయింది. చివరిబంతికి సింగిల్ తీస్తే గెలిచే పరిస్థితుల్లో రింకూ సింగ్ సిక్స్ కొట్టాడు. అయితే ఆ బంతి నోబాల్ కావడంతో.. సిక్స్ కౌంట్ కాకుండా, నోబాల్ కు దక్కిన రన్ తో టీమిండియా విజయం సాధించినట్టుగా అయ్యింది!