మద్యం కుంభకోణంలో తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరఫు వాదనలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ లో చంద్రబాబు తరఫున వాదనల్లో.. మద్యం వ్యవహారంలో జరిగిందంతా నాటి కేబినెట్ నిర్ణయం మేరకే అనే వాదనను ఆయన తరఫు న్యాయవాది వినిపించడం గమనార్హం!
ఎడాపెడా మద్యం డిస్ట్రిలరీలకు అనుమతులు ఇవ్వడానికి అనుగుణంగా చంద్రబాబు హయాంలో ప్రివిలైజ్ ఫీజును రద్దు చేశారు. ఆ సమయంలోనే బూమ్ బూమ్ బీర్లతో సహా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రస్తావిస్తున్న మద్యం బ్రాండ్లన్నీ ఉన్నాయి. ప్రివిలైజ్ ఫీజును రద్దు చేయడం వెనుక పెద్ద వ్యూహం ఉందని, ఇది తెలుగుదేశం అనుకూలురు ఆ బ్రాండ్లను స్థాపించడానికి అవకాశం ఇచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటోంది.
ఇందుకు సంబంధించి వివరాలను చెబుతూ మద్యం డిస్ట్రిలరీలకు ప్రివిలైజ్ ఫీజును రద్దు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 1500 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లిందని, ఇదంతా చంద్రబాబు వ్యూహం మేరకే జరిగిందని సీఐడీ కేసులు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేస్తూ.. అది పూర్తిగా కేబినెట్ నిర్ణయమని వాదిస్తున్నారు. కేబినెట్ ఆమోదం మేరకే ప్రివిలైజ్ ఫీజు రద్దు అయ్యింది తప్ప, అది నాటి సీఎంగా చంద్రబాబు నాయుడి వ్యక్తిగత నిర్ణయం కాదనే వాదన ద్వారా చంద్రబాబుకు బెయిల్ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ కేసు విచారణ వాయిదా పడింది.
ఇక్కడ విశేషం ఏమిటంటే.. గతంలో జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారికి సానుకూలంగా ఏపీ కేబినెట్ నిర్ణయాలు తీసుకుందనే ఆరోపణ తెలుగుదేశం పార్టీ చేసింది. అందుకు సంబంధించి కోర్టుకు వెళ్లింది. కేసులు కట్టించింది, సీబీఐ విచారణను మొదలుపెట్టించింది. జగన్ ను 16 నెలల పాటు జైల్లో కూడా పెట్టించింది. అయితే ఏపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల తమకు కలిగిన లబ్ధి పది రూపాయలు అయితే, తాము జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడి వందల రూపాయల స్థాయిలో ఉందని, జగన్ కంపెనీల్లో తాము పెట్టిన పెట్టుబడులు పారదర్శకం అని, పెట్టుబడులు, లాభాలు, నష్టాలన్నీ చట్ట ప్రకారమే ఉన్నాయని, లంచాలకు రసీదులు, లాభాలను పంచిస్తారా? అంటూ కూడా పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ప్రశ్నించాయి.
అయితే జగన్ ది అవినీతి అని తెలుగుదేశం పార్టీ దశాబ్దకాలం పై నుంచినే వాదిస్తోంది. జగన్ విషయంలో అప్పటి కేబినెట్ నిర్ణయాలే కేసులయ్యాయి. జగన్ నాటి కేబినెట్ లో మంత్రి కాదు, కనీసం ఎమ్మెల్యే కాదు! అయినా.. జగన్ అవినీతి పరుడే. అయితే చంద్రబాబు కేబినెట్ నిర్ణయాల వల్ల ఖజానాకు వందల కోట్ల నష్టం వాటిల్లినా నిర్ణయానికి మాత్రం ఆయన బాధ్యుడు కాదట!