భ‌యంతోనా, భ‌క్తితోనా… ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకున్న ప‌వ‌న్‌!

అదేంటో గానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. నోటి కొచ్చిన‌ట్టు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు మంత్రులు, ఇత‌ర వైసీపీ నేత‌ల్ని తిడుతుంటారు. ద‌త్త తండ్రి చంద్ర‌బాబు క‌ళ్ల‌ల్లో…

అదేంటో గానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ బ‌హిరంగ స‌భ‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ పూన‌కం వ‌చ్చిన‌ట్టు ఊగిపోతుంటారు. నోటి కొచ్చిన‌ట్టు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌తో పాటు మంత్రులు, ఇత‌ర వైసీపీ నేత‌ల్ని తిడుతుంటారు. ద‌త్త తండ్రి చంద్ర‌బాబు క‌ళ్ల‌ల్లో ఆనందం కోస‌మే త‌మ‌పై నోరు పారేసుకుంటాడ‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తుంటారు.

ఇదిలా వుండ‌గా తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారానికి బుధ‌వారం ప‌వ‌న్‌క‌ల్యాణ్ శ్రీకారం చుట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీతో ప‌వ‌న్ పొత్తు ఖ‌రారు చేసుకుని, 8 చోట్ల పోటీ కూడా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఆయ‌న వ‌రంగ‌ల్‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ ప్ర‌సంగిస్తూ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన బీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేత‌ల‌పై ఒక్క‌టంటే ఒక్క విమ‌ర్శ కూడా నేరుగా చేయ‌లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ప్ర‌ధాని మోదీ స‌భ‌లో కేసీఆర్ స‌ర్కార్‌ను తాను విమ‌ర్శించ‌క‌పోవ‌డాన్ని ప‌లువురు ప్ర‌శ్నించార‌న్నారు. కేసీఆర్ స‌ర్కార్‌ను విమ‌ర్శించ‌డానికి త‌న‌కు చిన్న స‌మ‌స్య వుంద‌న్నారు. నాలుగు కోట్ల మందితో స‌క‌ల జ‌నుల స‌మ్మె జ‌రిగిన‌ప్పుడు, వంద‌లాది మంది తెలంగాణ యువ‌త బ‌లిదానాలు జ‌రిగిన‌ప్పుడు, వాళ్లంద‌రికీ గౌర‌వార్థంగా తెలంగాణ నుంచి పుట్టిన పార్టీలే వుండాల‌ని కోరుకున్న‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. వాటి మీద గౌర‌వంతోనూ, అలాగే నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల‌పై గౌర‌వంతో ద‌శాబ్ద కాలంగా తాను గ‌ళ‌మెత్త‌లేద‌ని గొప్ప విష‌యాన్ని ఆయ‌న బ‌య‌ట పెట్టారు. ప్ర‌జ‌లు కోరుకున్న‌ప్పుడే తెలంగాణ‌లో అడుగు పెడ‌తాన‌ని నాయ‌కుల‌తో చెప్పాన‌ని ఆయ‌న గుర్తు చేశారు.

ఈ సంద‌ర్భంగా తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ఆయ‌న ఓ మాట ఇచ్చారు. ఆంధ్రాలో ఎలా తిరుగుతానో, తెలంగాణ‌లో కూడా వ‌చ్చే ఏడాది నుంచి ఆ విధంగానే ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రౌడీలు, గూండాలు పాల‌న చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. వారిని త‌ట్టుకుని నిల‌బ‌డ్డానంటే తెలంగాణ‌, వ‌రంగ‌ల్ ఇచ్చిన స్ఫూర్తే అని అన్నారు.

అవినీతి లేని తెలంగాణ‌, అంద‌రినీ స‌మానంగా చూసే సామాజిక తెలంగాణ వుంటుంద‌ని కోరుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అది ఏ స్థాయిలో, ఎలా వుందో త‌న‌కంటే మీకే బాగా తెలుస‌ని ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప‌వ‌న్ అన్నారు. ఇటీవ‌ల ప్ర‌తిప‌క్ష పార్టీలో చేరిన ఒక నాయ‌కుడు కాంట్రాక్ట‌ర్లు ఎవ‌రెవ‌రికి ఎంతెంత ప‌ర్సంటేజీ అవినీతి డ‌బ్బు ఇస్తారో బ‌హిరంగంగానే చెప్పాడ‌ని ఆయ‌న అన్నారు. ఇలా మాట్లాడాలంటే భ‌య‌ప‌డేలా ప్ర‌జ‌ల్లో చైత‌న్యం రావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌త్య‌ర్థుల‌ను విమ‌ర్శించ‌డానికి భ‌య‌ప‌డ్డాడ‌నే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ‌లో అవినీతి పాల‌న సాగుతోంద‌ని విమ‌ర్శించ‌డానికి ధైర్యం చాల్లేదు. అంతేకాదు, తెలంగాణ‌లో అవినీతి గురించి త‌న‌కంటే ప్ర‌జ‌ల‌కే బాగా తెలుస‌ని త‌ప్పించుకోవ‌డాన్ని జ‌నం ప‌సిగ‌ట్టారు. వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా ఏపీలో గూండాలు పాల‌న సాగిస్తున్నార‌ని విమ‌ర్శించ‌డం ప‌వ‌న్‌కే చెల్లింది. 

కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలంటే భ‌య‌మా? భ‌క్తా? అనేది తెలియ‌దు కానీ, మొత్తానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అంద‌రూ ఊహించిన‌ట్టుగానే ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌సంగించార‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.