తెలుగుదేశం పార్టీలో పనిచేసే నాయకులకే అందలాలు అని సీనియర్ నేత మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు భరోసా ఇస్తున్నారు. చంద్రబాబు కంటే ముందే టీడీపీలో ప్రవేశించిన అయ్యన్న సీనియర్ మోస్ట్ నేత. ఆయన మాటకు పార్టీలో విలువ గౌరవం ఉంది. అన్నింటికీ మించి ఫైర్ బ్రాండ్ గా ముద్ర ఉన్న అయ్యన్న అంటే చాలా మంది నేతలకు భయం కూడా ఉంది.
విజయనగరం జిల్లా కొత్తవలసలో జరిగిన టీడీపీ మీటింగులో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ పనిచేసే నేతలే టీడీపీకి ఆయువు పట్టు అంటున్నారు. అలాంటి వారిని చంద్రబాబు ఎప్పటికీ అన్యాయం చేయరని బాబు తరఫున గ్యారంటీ ఇచ్చారు. టీడీపీ తమ్ముళ్లలో పనిచేసే తమ్ముళ్లు వేరయా అని ఆయన తాత్పర్యం చెబుతున్నారు.
ఎస్ కోట నియోజకవర్గంలో రెండు వర్గాలు ఉన్నాయి మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారికి టికెట్ ఖాయం అన్నట్లుగా అయ్యన్న ఈ హామీ ఇచ్చారు. అదే విధంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా పనిచేసే నాయకులకే టికెట్లు ఇవ్వాలని ప్రతిపక్షంలోకి వచ్చాక డే వన్ నుంచి పార్టీ జెండా మోసి వీధుల్లో నిలబడి వైసీపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన వారికే టికెట్లతో పాటు అవకాశాలు ఇవ్వాలని చాలా కాలంగా అయ్యన్న డిమాండ్ చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో మరో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సరిగ్గా నాలుగవ సంవత్సరంలోనే పొలిటికల్ గా రీ యాక్టివ్ అయ్యారు. ఆయనకు అయ్యన్నకు పడదని ప్రచారంలో ఉన్న మాట. అధినాయకత్వం పనిచేసే వారికే న్యాయం చేయాలన్న అయ్యన్న మాటే కొలమానంగా తీసుకుంటే గంటా వంటి వారికి టికెట్లు దక్కవని అంటున్నారు.
చంద్రబాబు అలా పనితీరునే కొలమానంగా తీసుకుంటారా లేక ఎన్నికల్లో అప్పటి అవసరాలు అంగబలం అర్ధబలం సామాజిక రాజకీయ సమీకరణలు ఇతర కొలమానాలు తీసుకుని టికెట్లు ఇస్తారా అన్న దాని మీద టీడీపీలో తమ్ముళ్ల మధ్య ఆలోచనలు జోరుగా సాగుతున్నాయి. అయ్యన్న లాంటి సీనియర్లు అయితే పనితీరుకే పట్టం కట్టాలని అంటున్నారు. బాబు డెసిషన్ ఎలా ఉంటుందో అన్నదే ఇక్కడ కీలకమైన అంశం.