తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్. ఎన్టీఆర్ ఏ క్షణాన సైకిల్ గుర్తుని ఎంచుకున్నారో కానీ అది టీడీపీకి వర ప్రదాయినిగా మారింది. అయితే తెలుగుదేశం ఎన్టీయార్ హయాంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినా జాతీయ పార్టీగా మాత్రం రిజిష్టర్ చేసుకోలేకపోయింది.
జాతీయ స్థాయిలో 1990 తర్వాత సమాజ్ వాదీ పార్టీ ములాయం సింగ్ నాయకత్వంలో ఏర్పాటు అయింది. ఉత్తరప్రదేశ్ లో అనేక సార్లు అధికారంలోకి ఆ పార్టీ వచ్చింది. జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. ఎస్పీ ఇపుడు ఏపీ వైపు చూస్తోంది. ఏపీలో 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పాశం వెంకటేశ్వర్లు తెలిపారు.
విశాఖలో సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ 84 వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. సమాజ్ వాది పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పాశం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామ్ మనోహర్ లోహియా సిద్దాంతాలను నమ్మిన ఎస్పీ ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని స్పష్టం చేశారు. 1992లో ములాయం సింగ్ యాదవ్ ఆంధ్రలో ఎస్పీ పోటీ చేసిందని ఆయన గుర్తు చేశారు.
ఎస్పీ ఏపీలో పోటీ చేస్తే ఆ పార్టీ గుర్తు సైకిల్ ఏపీలో కనిపిస్తుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీది కూడా సైకిల్ గుర్తే. ఈ రెండు పార్టీలు పోటీ పడితే జాతీయ పార్టీగా ఎస్పీకే సైకిల్ గుర్తు ఇస్తారా అన్నది ఇపుడు రాజకీయంగా ఆసక్తిని రేపుతోన్న అంశంగా ఉంది. సైకిల్ గుర్తు టీడీపీకి ఊపిరి. ఎస్పీ ఏపీలో ఎంట్రీ ఇస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నదే రాజకీయ వర్గాలలో రేగుతున్న సందేహంగా ఉంది.