పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాపై తీవ్ర అసంతృప్తితో జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్‌పర్సన్ పసుపులేటి పద్మావతి, ఆమె తనయుడు సందీప్ రాయల్ బుధవారం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం పసుపులేటి పద్మావతి మీడియాతో మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు. రాజకీయంగా పవన్‌కల్యాణ్ అన్‌ఫిట్ అని ఆమె తేల్చి చెప్పడం గమనార్హం.
జనసేన ఏర్పాటు చేసిన తర్వాత రాయలసీమలో చేరిన మొట్టమొదటి మహిళా నాయకురాలిని తానే అని పసుపులేటి పద్మావతి చెప్పారు. తనలోని ధైర్యాన్ని, పట్టుదలను పవన్ చూశారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పవన్ అభిమానుల తల్లిదండ్రులకు ఆమె ఓ విన్నపం చేశారు. పవన్‌కల్యాణ్‌ను నమ్మొద్దని వేడుకున్నారు. పవన్‌ను నమ్మి జనసేనలోకి లేదా ఆయన మీటింగ్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పిల్లలను పంపొద్దని ఆమె చేతులు జోడించి విజ్ఞప్తి చేయడం విశేషం.
పసుపులేటి పద్మావతి అంటే శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకూ ఒక మచ్చలేని నాయకురాలని ఆమె అన్నారు. తనలాంటి మహిళలు వుంటే రాజకీయాల్లో ఎంత వరకైనా వెళ్తానని చెప్పిన పవన్, ఇప్పుడు మాట తప్పి తమను బయటికి పంపాడని తప్పు పట్టారు. జనసేన కోసం కష్టపడిన ఒక మహిళైన తనను మరో మహిళతో వెళ్లగొట్టించాడని ఆమె విమర్శించారు. ఆ మహిళ రుక్మిణి అని ఆమె అన్నారు.
జనసేనలోని చాలా మంది ఆ మహిళ వల్ల బాధపడుతున్నారని ఆమె చెప్పారు. జనసేనలో మహిళలపై అణచివేత సాగుతోందని పద్మావతి విమర్శించారు. జనసేనలో మహిళలు రాణించడం నాదెండ్ల మనోహర్‌కు ఇష్టం లేదన్నారు. ఎందుకంటే జనసేనలో తాను చెప్పిన వాళ్లకే టికెట్లు ఇవ్వాలని ఆయన కోరుకుంటారన్నారు. సమన్వయ కమిటీల్లోనూ, ఇతర కమిటీల్లోనూ నాదెండ్ల తన తొత్తులనే పెట్టుకున్నారని విమర్శించారు. ఈ విషయమై చాలా మంది జనసేన నేతలు తనకు ఫోన్ చేసి బాధపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.
పవన్ కరెక్ట్‌గా లేకపోవడం వల్లే ఆ పార్టీలో ఎవరికీ గౌరవం లేదన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనసేన కేడర్‌ను టీడీపీ నేతలు కూలీలుగా చూస్తున్నారని ఆమె వాపోయారు. అలాంటి పార్టీలో తాము ఎలా పని చేయాలని ఆమె ప్రశ్నించారు. నమ్మిన తమను పవన్‌కల్యాణ్ మోసం చేశాడని ఆమె విమర్శించారు. రాజకీయంగా ఆశ్రయమిచ్చి వైఎస్ జగన్ తమను రాజకీయంగా బతికించారని అన్నారు. తాము ఏమీ ఆశించి పార్టీలోకి రాలేదన్నారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పొత్తు కుదుర్చుకున్నంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో రెండు పార్టీల కేడర్ కలిసి పనిచేసే పరిస్థితి లేదన్నారు.