బాలీవుడ్ బ్యూటీ తెలుగులో నటిస్తుందంటే ఒకప్పుడు యమ క్రేజ్. ఆమెను హీరోయిన్ గా తీసుకోలేకపోయినా కనీసం ఓ స్పెషల్ సాంగ్ లోనైనా తీసుకొని మురిసిపోయేవారు మన మేకర్స్. ఆ తర్వాత రోజులు మారాయి. దాదాపు బాలీవుడ్ భామలంతా సౌత్ లో సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడీ ట్రెండ్ రివర్స్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
బాలీవుడ్ భామ టాలీవుడ్ ప్రాజెక్టులోకి వస్తే సెంటిమెంట్ సంగతి పక్కనపెడితే, ఎలాంటి ఉపయోగం ఉండడం లేదనేది తాజా విశ్లేషణ. దీనికి కోకొల్లలు ఉదాహరణలు కనిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్, అనన్య పాండే, సాక్షి వైద్య, సయీ మంజ్రేకర్.. ఇలా చెప్పుకుంటూపోతే లిస్ట్ చాలా పెద్దది అవుతుంది.
బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న అనన్య పాండేను లైగర్ లో తీసుకున్నారు. ఇక శ్రద్ధా కపూర్ ను సాహో సినిమాలో తీసుకున్నారు. వీళ్లను తీసుకోవడం వల్ల ఆ ప్రాజెక్టులకు ఎలాంటి ఉపయోగం దక్కలేదు. రీసెంట్ గా వచ్చిన సాక్షి వైద్య పరిస్థితి కూడా ఇదే. ఏజెంట్, గాండీవధారి అర్జున సినిమాల్లో చేసింది ఈ బ్యూటీ.
ఇక నేను స్టూడెంట్ సర్ అనే సినిమాతో అవంతిక దాసానీ వచ్చింది. ప్రముఖ నటి భాగ్యశ్రీ కూతురు ఈమె. ఆమె కూడా క్లిక్ అవ్వలేకపోయింది. ఇక మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ సంగతి తెలిసిందే. మేజర్ సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటికీ గని, స్కంద సినిమాలతో ఫ్లాపులు చవిచూసింది. నాగశౌర్యతో సినిమా చేసిన యుక్తీ తరేజాది కూడా సేమ్ స్టోరీ.
ఇలా బాలీవుడ్ నుంచి దిగుమతి అవుతున్న ముద్దుగుమ్మలెవ్వరూ ఇక్కడ పెద్దగా క్లిక్ అవ్వడం లేదు. నార్త్ భామలకు ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదురవుతున్న వేళ.. బనిత సంధు, జాన్వి కపూర్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. గూఢచారి-2 కోసం బనిత సంధును, దేవర సినిమా కోసం జాన్వి కపూర్ ను తీసుకున్నారు. వీళ్లయినా ఈ నెగెటివ్ ట్రెండ్ ను మారుస్తారేమో చూడాలి.