సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్ ఆడియన్స్ కు ఇచ్చిన ప్రామిస్ ఇది. అది కూడా తన సినిమాలకు సంబంధించి కాదు. తను చేసిన ఓ వెబ్ సిరీస్ కారణంగా, వెంకీ ఈ వాగ్దానం ఇవ్వాల్సి వచ్చింది.
రానా నాయుడుపై తీవ్ర విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇప్పుడా వెబ్ సిరీస్ కు సీజన్-2 రాబోతోంది. జనవరి నుంచి వెంకీ సెట్స్ పైకి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రామిస్ చేశారు వెంకటేష్.
“జనవరి నుంచి నాగా నాయుడు పాత్రలోకి వెళ్తున్నాను. సీజన్-2 స్టార్ట్ చేస్తున్నాను. ఆ నాగా నాయుడు మామూలోడు కాదు. ప్రపంచవ్యాప్తంగా అంతా చూశారు. ఇప్పుడు మళ్లీ చేయమంటున్నారు. ఏంట్రా నువ్వు అలా చేస్తున్నావ్ అని పెద్దోళ్లు అంటున్నారు. కుర్రాళ్లు మాత్రం మళ్లీ చేయమంటున్నారు. అందుకే ఈసారి కాస్త జాగ్రత్తగా ఉంటాను, ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టను. మొదటి సీజన్ చూసి మనోళ్లు కొంతమంది హర్ట్ అయ్యారు. ఈసారి మాత్రం అలా ఉండదు, చక్కగా ఉంటుంది. కానీ కొంచెం మోసం/కొంటెతనం ఉంటుంది.”
ఇలా సీజన్-2లో తన పాత్రలో బోల్డ్ నెస్ కాస్త తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు వెంకీ. సైంధవ్ సినిమాకు సంబంధించి సాంగ్ లాంచ్ లో భాగంగా మాట్లాడిన వెంకీ, ఈ మేరకు ప్రకటన చేశారు.
రాంగ్ యూసేజ్ అనే లిరిక్స్ తో సాగే సాంగ్ ను ఈరోజు విడుదల చేశారు. వెంకటేష్ మైండ్ సెట్ కు, అతడి తాత్వికతకు చాలా దగ్గరగా ఉంది ఈ సాంగ్. వెంకీ కూడా అదే చెప్పాడు. జీవితం చాలా చిన్నదని, దాన్ని అస్వాదించాలని అన్నాడు. సెల్ ఫోన్, డబ్బుకు బందీ అయిపోకుండా.. ఆరోగ్యం-ఫిట్ నెస్ పై అంతా ఫోకస్ పెట్టాలని కోరాడు.