ఇంకో రెండు నెలలు అంటే నవంబర్ మూడో వారం నుంచి జనవరి మూడో వారం వరకు వస్తున్న సినిమాలకు ఓ సారూప్యం వుంది. మహేష్ బాబు గుంటూరు కారం ఒక్కటే దీనికి మినహాయింపు. మిగిలిన చాలా సినిమాలు హిట్ బాటలోకి వెళ్లాల్సి వుంది. లేదూ అంటే అటు హీరోల కెరీర్‌కు ఇటు మార్కెట్ కు ఇబ్బంది వస్తుంది. అదే అసలు విషయం.
నవంబర్ మూడో వారంలో మెగా జూనియర్ హీరో వైష్ణవ్ తేజ్ నటించిన ఆదికేశవ థియేటర్లోకి వస్తోంది. ఈ సినిమా పక్కా హిట్ కావడం అన్నది హీరోకి చాలా అవసరం. హీరో చేతులో మరో సినిమా లేదు. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా హిట్ అయితే తప్ప వెంటనే మరో సినిమా రావడం కష్టం. పైగా నాన్ థియేటర్ మార్కెట్, థియేటర్ మార్కెట్ ఈ హీరోకి చాలా సమస్యగా వుంది. అందువల్ల ఈ సినిమా హిట్ అయితేనే వైష్ణవ్ తేజ్ కు కెరీర్ ముందుకు వెళ్తుంది.
నితిన్ సినిమా ఎక్స్ ట్రా ఆర్టినరీమాన్ డిసెంబర్ తొలివారంలో వస్తోంది. సరైన హిట్ పడాల్సి వుంది. కెరీర్ కు సమస్య లేకపోవచ్చు. కానీ మార్కెట్ కు సమస్యే. ఇప్పటికే నాన్ థియేటర్, థియేటర్ మార్కెట్ అంత ఆశాజనకంగా లేదు ఈ హీరోకి. అందువల్ల ఈ సినిమా హిట్ కావాల్సిందే. పైగా దర్శకుడు వక్కంతం వంశీకి కూడా, హీరోకి ఎంత అవసరమో, దర్శకుడికి రెట్టింపు అవసరం.
అదే టైమ్ లో విడుదలవుతోంది నాని సినిమా హాయ్ నాన్న. నాని కెరీర్ చిత్రంగా వుంది. సినిమాలు సరైన హిట్ లు కాకపోయినా, అతని రెమ్యనిరేషన్ అంతకు అంతకూ పెరుగుతూనే వుంది. చేతిలో వన్ బై వన్ సినిమాలు వస్తూనే వున్నాయి. కానీ థియేటర్ మార్కెట్ చూసుకోవాలి. హాయ్ నాన్న వరకు కిందా మీదా పడి పూర్తి చేస్తున్నారు. దసరా కొన్న బయ్యర్లు అంతా లాస్ నే. అంటే సుందరానికి సరే సరి. మైత్రీ సంస్థ కాబట్టి సైలంట్ గా డబ్బులు వెనక్కు ఇవ్వడం అన్నది కామన్. కానీ ఇలా ప్రతి సినిమా అంటే హీరో కెరీర్ కు మైనస్ అవుతుంది.
డిసెంబర్ నెలాఖరులో వస్తోంది ప్రభాస్ సలార్ సినిమా. రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్ ఇలా ప్రతి సినిమా ఫెయిల్యూర్ నే. కలెక్షన్లు, అమ్మకాలు ప్రస్తుతానికి బాగానే వున్నాయి. కానీ ఇదే క్రేజ్ కొసవరకు వుండదు. అలా ఫ్లాప్ లు ఇచ్చుకుంటూ పోతే. అందువల్ల సలార్ సినిమా హిట్ కావాలి. ప్రభాస్ కెరీర్ కు, మార్కెట్ కు ఢోకా లేకపోవచ్చు కానీ, ఫ్యూచర్ లో స్టడీగా వుండాలి అంటే సలార్ సినిమా కనీసం హిట్ అనిపించుకోవాలి.
విక్టరీ వెంకటేష్ సైంధవ్ సినిమా రాబోతోంది. వెంకీ కూడా హిట్ ట్రాక్ లో లేరు. రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఏవీ పెద్దగా క్లిక్ కావడం లేదు. రీమేక్ ట్రయ్ చేసారు. ఫ్యామిలీ ట్రయ్ చేసారు, వెబ్ సిరీస్ లోకి వెళ్లారు. ఇప్పుడు ఈ జనరేషన్ కు నచ్చే సినిమా చేస్తున్నారు. నచ్చి తీరాలి. లేదూ అంటే మళ్లీ వెంకీ ఏం చేయాలో అర్థం కాక జంక్షన్ లో వుండిపోతారు.
రవితేజ కు థమాకా తరువాత హిట్ లేదు. వాల్తేర్ వీరయ్య ను సోలో సినిమాగా కౌంట్ లో వేయడానికి లేదు. ధమాకా తరువాత అన్నీ డిజాస్టర్ లే. బయ్యర్లు నష్టాలే. నిర్మాతలకు కూడా అంతో ఇంతో నష్టాలే. ఇలాంటి టైమ్ లో ఈగిల్ సినిమా వస్తోంది. ఈ సినిమా హిట్ కావాల్సి వుంది. చేతినిండా సినిమాలు వున్నాయి. దానికి ఢోకా లేదు. కానీ మార్కెట్ నిలబడాలి అంటే ఈగిల్ హిట్ కావాలి.
మొత్తం మీద రాబోయే రెండు మూడు నెలల్లో సినిమాలు అన్నీ హీరోలకు టఫ్ ఎగ్జామ్స్ నే.