స్కిల్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబునాయుడికి ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సవాల్ చేసేందుకు సిద్ధమైంది. బాబుకు ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ టి.మల్లికార్జునరావు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందనేది సీఐడీ వాదన. అందుకే సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు ఏపీ సర్కార్ అన్నీ సిద్ధం చేసుకుంది.
స్కిల్ స్కామ్లో చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డాడనేందుకు పక్కా ఆధారాలున్నాయనేది సీఐడీ వాదన. అయితే అలాంటిది ఏమీ లేదని ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ మల్లికార్జునరావు తన తీర్పులో పేర్కొన్నారు. మళ్లీ ఆయనే ఏసీబీ కోర్టు విచారణలో జోక్యం చేసుకోనని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర్పులో పరస్పర విరుద్ధమైన అంశాలున్నాయని ఏపీ సర్కార్ భావిస్తోంది.
బాబుకు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ సీఐడీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ పిటిషన్లో ఏపీ హైకోర్టు వ్యవహరించిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని ఆరోపిస్తోంది. ట్రయల్ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా బెయిల్ ఎలా ఇస్తారని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించడం గమనార్హం. బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా హైకోర్టు వ్యవహరించిందని ఏపీ ప్రభుత్వ వాదన.
అసలు చంద్రబాబునాయుడు ప్రస్తావించని అంశాలకు సంబంధం లేనివి కూడా హైకోర్టు పేర్కొనడాన్ని ఏపీ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఏ రకంగా చూసినా ఏపీ హైకోర్టు తీర్పు లోపభూయిష్టమని ఏపీ సర్కార్ భావన. అది ఏ రకంగా లోపభూయిష్టమో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం కావడం మరోసారి ఉత్కంఠ రేపుతోంది.