స్కిల్ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్ట్, అనంతరం ఆయనకు న్యాయ స్థానంలో ఊరట దక్కకపోవడంపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా ఏసీబీ, హైకోర్టు జడ్జిలపై టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతర కామెంట్స్ చేయడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది.
ప్రస్తుతం జడ్జిలపై దూషణలకు సంబంధించి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇందులో భాగంగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం. జడ్జిలను దూషిస్తూ సోషల్ మీడియాలో వీరు పోస్టులు పెట్టారు. అలాగే టీడీపీ అనుకూల చానళ్లతో మాట్లాడుతూ జడ్జిలను కించపరిచే కామెంట్స్ చేశారు.
కోర్టు ధిక్కరణగా భావించిన హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో టీడీపీ నేతలతో పాటు గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్‌లకు కూడా నోటీసులు జారి చేయడం విశేషం. జడ్జిలపై దూషించడాన్ని టీడీపీ నేతలు సమర్థించుకుంటారో చూడాల. జడ్జిలకు కులం, ఆర్థిక లావాదేవీలు అంటకట్టి టీడీపీ నేతలు ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇప్పటికే కొందరు టీడీపీ నేతలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇవాళ మరికొందరికి నోటీసులు జారీ చేసి, విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.