మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిపై టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. వెంకటగిరి నుంచి వైసీపీ తరపున గత ఎన్నికల్లో ఆనం గెలుపొందిన సంగతి తెలిసిందే. మంత్రి పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో సొంత ప్రభుత్వంపై వ్యతిరేక కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఆయన మద్దతు ఇచ్చారనే కారణంతో పార్టీ నుంచి గెంటేశారు.
అనంతరం ఆయన టీడీపీకి చేరువయ్యారు. లోకేశ్ పాదయాత్రలో ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే చంద్రబాబు అరెస్ట్‌పై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా టీడీపీలో అంతా తానే అన్నట్టు ఆనం వ్యవహరిస్తున్నారు. ఈ పరంపరలో వెంకటగిరి నుంచి మరోమారు తాను బరిలో వుంటానని తనకు తానుగా ప్రచారం చేసుకుంటున్నారు.
వెంకటగిరి నియోజకవర్గంలోని టీడీపీ చిన్నస్థాయి నాయకుడి మొదలుకుని మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల వరకూ ఆనం స్వయంగా ఫోన్ చేస్తూ పలకరిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మరోసారి తానే పోటీ చేస్తానని, అందరి సహకారం కావాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ నాయకుడు డాక్టర్ మస్తాన్ యాదవ్ రగిలిపోతున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి ఐదేళ్లకో పార్టీ మారుతూ అధికారాన్ని అనుభవిస్తున్నారని వారు మండిపడుతున్నారు. టీడీపీ కష్టకాలంలో వుండగా తాము అండగా నిలిచామని, తమను కాదని ఆనం అభ్యర్థిగా తనకు తాను ఎలా ప్రకటించుకుంటారని, ఎలా ప్రచారం చేసుకుంటారని వారు నిలదీస్తున్నారు. వెంకటగిరి కాకుండా, మరెక్కడైనా ఆనం పోటీ చేసేందుకు చూసుకోవాలని, స్థానికేతరుడైన ఆనంకు ఇక్కడేం పని అని వాళ్లిద్దరూ ప్రశ్నిస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో తానే పోటీలో వుంటానని కురుగొండ్ల చెబుతుండగా, అదే మాట మస్తాన్ యాదవ్ నుంచి కూడా రావడం గమనార్హం. ఆనం పార్టీ మార్పు వెంకటగిరిలో టికెట్ చిచ్చు పెడుతోందన్నది నిజం. ఎన్నికలు సమీపించే కొద్దీ వెంకటగిరి టీడీపీలో విభేదాలు బట్టబయలు అవుతాయనడంలో సందేహం లేదు.