త్రిషపై చేసిన 'రేప్ వ్యాఖ్యల'తో ఇప్పటికే పెద్ద దుమారం రేపాడు నటుడు మన్సూర్ అలీఖాన్. ఇప్పుడు ఆ వివాదానికి మరింత ఆజ్యం పోశాడు. తాజాగా మన్సూర్ చేసిన మరికొన్ని కామెంట్స్ ఈ వివాదాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి.
“నేను చేసిన వ్యాఖ్యల్ని త్రిష ఖండించింది. ఆమె స్టేట్ మెంట్ ను పబ్లిష్ చేసిన మీడియా, మా ఇద్దరి ఫొటోల్ని పక్కపక్కన ప్రింట్ చేసింది. ఆ ఫొటోలు చూస్తుంటే త్రిష పెళ్లికూతురిలా, నేను పెళ్లికొడుకులా ఉన్నట్టు అనిపించింది. అయితే నావి మంచి ఫొటోలు వాడలేదు. అంతకంటే మంచి ఫొటోలు నావి మీడియాకు దొరకలేదా?”
ఇది మన్సూర్ అలీఖాన్ తాజా స్టేట్ మెంట్. త్రిషకు క్షమాపణలు చెప్పేంతవరకు అతడ్ని నిషేధిస్తున్నట్టు ఆదేశాలు జారీచేసింది నడిగర్ సంఘం. దీనిపై సీరియస్ అయిన నటుడు, ప్రెస్ మీట్ పెట్టాడు. తన వివరణ కోరకుండా ఏకపక్షంగా నడిగర్ సంఘం ఆదేశాలు జారీచేసిందని, మరో 4 గంటల్లో నడిగర్ సంఘం తన ఆదేశాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
త్రిషపై తను చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించారు మన్సూర్. తను తప్పుగా మాట్లాడలేదన్నారు. మీడియా తన వ్యాఖ్యల్ని వక్రీకరించిందని, త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తనకు తమిళ ప్రజల మద్దతు ఉందన్నారు.
తను కేవలం సినిమాలో రేప్ సీన్ గురించి మాత్రమే మాట్లాడానని, నిజంగా రేప్ చేసినట్టు మీడియా రాసిందని ఆరోపించాడు మన్సూర్. తెరపై మర్డర్ సీన్ లో నటిస్తే, నిజంగా మర్డర్ చేసినట్టా అని ప్రశ్నించాడు.
మరోవైపు త్రిషకు రోజురోజుకు ప్రముఖుల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా చిరంజీవి, త్రిషకు మద్దతుగా నిలిచారు. మన్సూర్ వ్యాఖ్యల్ని ఖండించారు. మన్సూర్ పై కేసు నమోదు చేయాల్సిందిగా జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే తమిళనాడు పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఓ పక్క ఇంత జరుగుతుంటే, మన్సూర్ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు.