కాంగ్రెస్‌పై మరోసారి చంద్రబాబు మనసు పారేసుకుంటున్నారా? అంటే… ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ శ్రేణుల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారికంగా ఏ ఒక్క పార్టీకి మద్దతు ప్రకటించని సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు స్కిల్ స్కామ్‌లో అరెస్టు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో 50 రోజులకు పైగా ఉండడం వెనుక ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారని టీడీపీ శ్రేణుల నమ్మకం.
అందుకే తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల భవితవ్యం డిసెంబర్ 3న తేలనుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీడీపీ బలంగా విశ్వసిస్తోంది. కాంగ్రెస్ పార్టీనే రావాలని టీడీపీ ఆకాంక్ష.
తెలంగాణతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలను సాధిస్తే మాత్రం… చంద్రబాబు బహిరంగంగానే మరోసారి బీజేపీపై విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ భుజంపై జగన్‌ను రాజకీయంగా కాల్చేయాలని చంద్రబాబు ఎత్తుగడ వేశారు. అయితే చంద్రబాబు అంచనా తప్పింది. మరోసారి కేంద్రంలో బీజేపీనే అధికారంలోకి వచ్చింది.
ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తే, ఇక దేశంలో ఆ పార్టీకి తిరుగు వుండదని చంద్రబాబు అభిప్రాయం. గతంలో కాంగ్రెస్‌కు అధికారం దక్కుతుందని పొరపడ్డామని, ఈ దఫా అనుకూల వాతావరణం కనిపిస్తే ముందే మద్దతు ప్రకటించడానికి సిద్ధపడినా ఆశ్చర్యపోనవసరం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. పైగా టీడీపీ శ్రేణుల్లో కాంగ్రెస్‌పై సానుకూల వాతావరణం వుంది. బీజేపీ కంటే ఏ రకంగా చూసినా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్య లక్షణాలున్నాయని, మరీ ఇంతగా ఎవరినీ టార్గెట్ చేయదనే సానుకూల చర్చ టీడీపీలో జరుగుతోంది.
రాజకీయాల్లో అంతిమంగా ప్రజాదరణే ప్రాతిపదిక అని, అది కాంగ్రెస్‌కు ఉన్నప్పుడు జత కట్టడంలో తప్పేంటనే ప్రశ్న టీడీపీ నుంచి వస్తోంది. తెలంగాణలో ఈ ఆలోచనతోనే కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో టీడీపీ శ్రేణులు మద్దతు తెలపడాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. అసలే చంద్రబాబు యూటర్న్‌కు ముద్దుబిడ్డ. కాంగ్రెస్‌తో రానున్న ఎన్నికల్లో జత కట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని నమ్మేవాళ్లలో బాబు ప్రప్రథముడు.