ఆస్ట్రేలియన్ బ్యాట్స్మన్ మిచెల్ మార్ష్ వరల్డ్ కప్ ట్రోఫీపై తన కాళ్లను పెట్టుకున్నాడని కొందరు భారతీయులు తెగ ఇదైపోతున్నారు. మీకు గౌరవాన్ని తెచ్చి పెట్టిన వరల్డ్ ట్రోఫీని అగౌరవపరుస్తున్నారంటూ ట్వీట్లేస్తున్నారు!
అయితే .. విశేషం ఏమిటంటే, ఈ అంశంపై ఆస్ట్రేలియా నుంచి పెద్ద స్పందన ఏమీ లేదు. వారు లైట్ తీసుకున్నా.. భారతీయులు మాత్రం చాలా ఫీలవుతున్నారు. అయితే అయితే అది ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్ గెలుచుకున్న ప్రపంచకప్. దాన్ని వారు దాన్ని ఏం చేసుకున్నా.. మాట్లాడాల్సిన అవసరం ఇండియన్స్ కు లేదు!
బహుశా ఇండియాను ఓడించి గెలుచుకోవడం వల్ల కాస్త బాధతో ఈ అగౌరవం అంశాన్ని ప్రస్తావిస్తున్నారేమో కొంతమంది! అయితే ఆటను ఆటగా చూసే వాళ్లు, ట్రోఫీని కూడా ట్రోఫీలా చూస్తున్నారనే అనుకుని లైట్ తీసుకోలేరా!
ఇండియా ప్రపంచకప్ గెలిచినప్పుడు సచిన్ ఆ ట్రోఫీని పరమ పవిత్రంగా మోసుకొచ్చాడు, ధోనీ దాన్ని అలా తీసుకున్నాడు.. అనే వర్ణనలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకు వరల్డ్ కప్ ట్రోఫీ అపురూపం కావొచ్చు! రెండు సార్లే గెలిచాం కాబట్టి.. అది అపురూపం అనుకోవచ్చు. అయితే ఆస్ట్రేలియా ఆరోసారి విజేతగా నిలిచింది. అలాంటప్పుడు.. ట్రోఫీపై మనకున్నంత గౌరవం ఉంటుందనేముంది!
వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ట్రోఫీ.. ఇలా ఆస్ట్రేలియాకు క్రికెట్ లో ప్రపంచ విజేత అనిపించుకోవడం కొత్త కాదు! కేవలం క్రికెట్ అనే కాదు.. ఒలింపిక్స్ లో పతకాల విషయంలో కూడా ఆస్ట్రేలియా టాప్ ఫైవ్ లో నిలుస్తుంది ప్రతి సారీ. చైనా, అమెరికాలకు గట్టి పోటీ ఇస్తుంది. కాబట్టి.. ట్రోఫీలు, మెడల్స్ లు మరీ అంత మురిపెం కాకపోవచ్చు. అలాగని ఆస్ట్రేలియా టీమ్ అంతా ఆ ట్రోఫీని కాళ్లతో తన్నలేదు.
ఎవరో ఒక ఆటగాడు అలా కాళ్లు పెట్టే సరికి మనం బుగ్గలు నొక్కుకోవడం మనకు మాత్రమే సాధ్యమయ్యే చోద్యం!