టాలీవుడ్ నిర్మాతలు అంతా మీడియా ఇచ్చే రేటింగ్‌లు మాత్రమే తమ ముందున్న అతి పెద్ద సవాలు, అది ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తారు? అన్నది తెలుసుకోవాలన్నదే కీలక టాస్క్ అన్నట్లు కనిపిస్తోంది.
నిజానికి ఇది కాదు టాలీవుడ్ నిర్మాతల ముందు వున్న టాస్క్. నిన్నటికి నిన్న నిర్మాత బన్నీ వాస్ ఒక కొత్త ఆలోచన చేసారు. మీడియాను స్టేజ్ మీద కూర్చోపెట్టి, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి పెద్లల చేతి మైక్ ఇచ్చి ప్రశ్నలు- జవాబులు అనే కార్యక్రమం నిర్వహించారు. నిజానికి ఈ ఐడియా బాగుంది. కానీ ఈ కార్యక్రమం మొత్తం అసలు రేటింగ్‌లు ఎలా ఇస్తారు? మీడియా- రేటింగ్‌లు అనే అంశం మీద చర్చా కార్యక్రమంగా జరిగింది తప్ప వేరు కాదు.
ఇక్కడ రెండు అంశాలు వున్నాయి. ఒకటి జరిగింది.. రెండు జరగనిది… అంతకన్నా కీలకం జరగాల్సింది.
రేటింగ్‌లు అనేవి, ఓ సినిమాకు చివరాఖరు ప్రక్రియ. సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని థియేటర్‌లో పడిన తరువాత వచ్చేది రేటింగ్. అది మీడియా ద్వారా కావచ్చు.సోషల్ మీడియా ద్వారా కావచ్చు. మొత్తం మీద సినిమా థియేటర్ లో పడిన తరువాతే. థియేటర్ లో సినిమా పడిన తరువాత రేటింగ్ లు ఇచ్చేవారు కావచ్చు, వెల్లడించే వారు కావచ్చు. మహా అయితే వంద మంది వుంటారు. వీటిలో వెబ్ సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ వుంటాయి. మొదటి రోజు లక్షల మంది సినిమా చూస్తారు. ఈ రేటింగ్ లను కూడా లక్షల మంది చూస్తారు.
అంటే నేరుగా సినిమాను లక్షల మంది చూస్తారు. సినిమా చూడకుండా ముందుగా రేటింగ్ ను లక్షల మంది చూస్తారు. నేరుగా సినిమాను చూసే లక్షల మంది చెప్పేదాన్నే మౌత్ పబ్లిసిటీ అంటారు. వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. ఇదే ఏ సినిమాకు అయినా కీలకం. వందల మంది ఇచ్చే రేటింగ్‌లో పదుల సంఖ్యలోనే క్రెడిబులిటీ వున్నవి వుంటాయి. వీటి మీదే నిర్మాతల దృష్టి అంతా. ఇక్కడ రేటింగ్ తెచ్చుకుంటే సినిమా పాస్ అయిపోతుందనే నమ్మకం బలంగా వుంది నిర్మాతలకు.
అయితే రేటింగ్‌ల విషయంలో రెండు మూడు రకాలుగా వుంటుంది. క్రిటిక్స్ రేటింగ్, సినిమా కమర్షియల్ సక్సెస్ మ్యాచ్ అయ్యేది ఒక రకం. క్రిటిక్స్ రేటింగ్- కమర్షియల్ సక్సెస్ వేరు వేరుగా వుండడం రెండో రకం. ఇక్కడ రేటింగ్ వచ్చినా ఆడకపోవడం. రేటింగ్ రాకున్నా ఆడడం అనే భిన్నమైన అంశాలు వుంటాయి. సాయి కొర్రపాటి నిర్మించిన ‘మనమంతా’ సినిమాకు చాలా మంచి రేటింగ్‌లు వచ్చాయి. నాలుగు స్టార్లు, ఆపైన వచ్చాయి. కానీ సినిమా నష్టాలే మిగిల్చింది. చాలా సినిమాలకు రెండున్నర రేటింగ్ లు వచ్చినవి వున్నాయి. కానీ అవి భారీ కమర్షియల్ సక్సెస్ లు సాధించాయి.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, రేటింగ్ అనేది సినిమా కథ, కథనం, క్వాలిటీ మేకింగ్, ఇలా పలు అంశాలను బట్టి ఇచ్చేవి. క్రిటిక్స్ ఇది మంచి సినిమా కాదు అన్నా జనం చూడొచ్చు. ఉదాహరణకు భగవద్గీత బజార్లో అమ్మితే పది మంది కూడా కొనకపోవచ్చు. బూతు పుస్తకం అమ్మితే ఎగబడి కొనొచ్చు. అంత మాత్రాన భగవద్గీతకు ఇచ్చిన రేటింగ్ వేస్ట్, బూతు పుస్తకానికి ఇచ్చిన రేటింగ్ తప్పు అనడానికి లేదు.
నిర్మాతలు కానీ సినిమా వ్యక్తులు కానీ కేవలం రేటింగ్ లు మాత్రమే చూసి, సమీక్ష వదిలేయడం అన్నది పెద్ద సమస్య. సమీక్ష మొత్తం చూస్తే సినిమా మంచి చెడ్డలు మొత్తం వుంటాయి. అప్పుడు తమ సినిమా ఎక్కడ బాగుంది.. ఎక్కడ ఫెయిలైంది అన్నది క్లారిటీ వస్తుంది. అలా కాకుండా జస్ట్ రేటింగ్ చూడడం వల్ల ఒక్కోసారి జనానికి నప్పే కంటెంట్ వున్న సినిమాలు, క్రిటిక్స్ నచ్చలేదు అన్న డిటైల్డ్ క్లారిటీ వస్తుంది.
క్రిటిక్స్ సైడ్ నుంచి చూస్తే కూడా కొన్ని సమస్యలు వున్నాయి. వీరు ఏళ్ల కాలంగా క్రిటిక్స్ మల్టీ ఫ్లెక్స్ లకు పరిమితం అయిపోయారు. బి సి సెంటర్ల థియేటర్లలో అప్పుడప్పుడు మాస్ సినిమాలు చూడాల్సి వుంది. అప్పుడు థియేటర్ లో ఏ సీన్ కు జనం రెస్పాండ్ అవుతున్నారు. ఏ సీన్ కు కావడం లేదు అన్నది ఓ అవగాహన వస్తుంది. మల్టీ ఫెక్స్ ల్లో, ముఖ్యంగా ప్రెస్ షో ల్లో వచ్చే స్పందన వేరు. కిందన బి. సి సెంటర్ల సింగిల్ థియేటర్ లో వచ్చే స్పందన వేరు. అందుకే యూనిట్ జనాలు సినిమా చూడానికి సింగిల్ థియేటర్లు ఎంచుకుంటాయి. అక్కడ వచ్చే స్పందనను బట్టే సినిమా సక్సెస్ ను అంచనా వేసుకుంటాయి.
ఇదిలా వుంటే నిర్మాతలు మీడియాను కేవలం సమీక్షల గురించే ప్రశ్నలు అడిగారు. కానీ ఇది మాత్రమే కాదు కావాల్సింది. సినిమాను జనం దగ్గరకు ఎలా తీసుకెళ్లాలి అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రెస్ మీట్ లు, ఇంటర్వూలు, క్యూ అండ్ ఏ లు, కాలేజీ విజిట్ లు ఇవన్నీ రొటీన్ అయిపోతున్నాయి. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసినట్లు అవుతోంది వ్యవహారం. చిన్న సినిమా, పెద్ద సినిమా ఎవరు వెళ్లినా కాలేజీల్లో ఘన స్వాగతం వస్తోంది. కానీ సినిమాకు టికెట్ తెగడం లేదు. అంటే ఏమిటన్నమాట.. జనం ఇదంతా జస్ట్ ఓ టైమ్ పాస్ ఎంటర్ టైన్ మెంట్ గా చూస్తున్నారు. వాళ్లు వెళ్లాలనుకుంటున్న సినిమాకు వెళ్తున్నారు.
డిజిటల్ యుగంలో, సోషల్ మీడియా కాలంలో సినిమాను జనాలకు ఎలా చేరువ చేయాలి. ఎలా బజ్ తీసుకురావాలి అన్నది నిర్మాతల ముందు వున్న అతి పెద్ద సమస్య. సినిమాకు క్లాప్ కొట్టిన నాడే జనం డిసైడ్ అయిపోతున్న రోజులు ఇవి. ఈ సినిమాకు ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ లో వెళ్లాలా? వద్దా? అని. అలా డిసైడ్ కావాలి అంటే కాంబినేషన్ లే కీలకంగా వున్నాయి. ఆ తరువాత త్రూ అవుట్ మేకింగ్ నుంచి బజ్ పెంచుకుంటూ రావాలి.
వీటి మీద మీడియాతో నిర్మాతలు ఇంట్రాక్ట్ అయి, పరిస్థితిని అవలోకనం చేసి వుంటే బాగుండేది. కానీ ఆ ప్రయత్నం కోటబొమ్మాళి సినిమా టీమ్ చేయలేదు. ఇప్పుడు సినిమా ప్రచారం అన్నది ఓ రొటీన్ తీరానికి చేరిపోయింది. ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్స్, టీజర్, ట్రయిలర్ ఇలా వదలడం, మధ్యలో ఒకటి రెండు ప్రెస్ మీట్లు, ఊళ్లు తిరగడం, గేమ్ షో లు ఇలా ఫిక్స్ డ్ ఫార్మాట్ కు చేరిపోయింది.
డిజిటల్, సోషల్ మీడియా సంస్థలు ప్రచారంలోకి దిగిన తరువాత, పాన్ ఇండియా పబ్లిసిటీ వచ్చిన తరువాత వివిధ రాష్ట్రాలు, జాతీయ మీడియా ఇలా కొత్త వ్యవహారాలు వచ్చి చేరాయి. కానీ నిర్మాతలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే కొన్నిసినిమాలకు ఏమీ చేయనక్కరలేదు. రాజమౌళి సినిమా అంటే లోకల్ పబ్లిసిటీ అవసరమే లేదు. పెద్ద సినిమాలకు అయితే తెలుగునాట ఊళ్లు తిరగక్కరలేదు. కానీ పబ్లిసిటీ సమస్య అంతా చిన్న, మధ్య తరగతి సినిమాలకే.
వీటికి జనాలను ఎలా థియేటర్ కు తీసుకురావాలన్నదే కీలకం. థియేటర్‌లో ఫెయిల్ అయిన, థియేటర్ లో ఆడని సినిమాలు ఓటిటి లో కుమ్మేస్తున్నాయి. కారణం, అక్కడ ఫ్రీ. ప్రతి వారం ఏదో ఒకటి చూడాలి. అందువల్ల ఓటిటి లో కూడా ఓపెనింగ్ కుమ్మేస్తోంది. అది చూసి రేటింగ్‌లు తమ సినిమాను చంపేసాయని, ఓటిటిలో మాత్రం విరగచూస్తున్నారని భ్రమ పడుతున్నారు.
రేటింగ్‌లు అన్నవి న్యూస్ పేపర్లలో వార్తల మాదిరిగా ఓ అంశం మాత్రమే. సినిమాకు అదే పరమార్ధం కాదు. మీడియా వృత్తి, కంటెంట్ లో రివ్యూలు కూడా ఓ భాగం. నిర్మాతలు దాని మీదే దృష్టి పెట్టి, అసలు విషయం మరిచిపోతున్నారు. ఇంకోలో చెప్పాలంటే తమ వైఫల్యాలు తెలిసినా కూడా సైలంట్ గా వుండిపోతున్నారు.
దర్శకులను కంట్రోలు చేయలేరు. కథను, క్వాలిటీని నూటికి తొంభై శాతం మంది నిర్మాతలు అస్సలు కంట్రోలు చేయలేరు. ఖర్చును నియంత్రించలేదు. ఇవన్నీ చేస్తే సరైన సినిమా వస్తుంది. దాంతో సరైన రేటింగ్ కూడా వచ్చే అవకాశం వుంటుంది.
దర్శకులు అందరినీ వేదిక మీద కూర్చో పెట్టి, నిర్మాతలు మైక్ పట్టుకుని, ఎందుకు సినిమాలు ఇలా తీస్తున్నారు. ఎందుకు వృధా ఖర్చు చేయిస్తున్నారు. ఎందుకు స్క్రిప్ట్ ఇలా అఘోరించింది అని పంచాయతీ పెట్టగలరా? ఆ అవకాశమే లేదు.
టాలీవుడ్ ముందు ఎన్నో సమస్యలు వున్నాయి. ఎన్నో సవాళ్లు వున్నాయి. అవన్నీ వదిలేసి, కేవలం సమీక్షలే సమస్య అనుకుని, భ్రమలో బతికేస్తే, ఎవరూ ఏమీ చేయలేరు.