వారు పాపం.. కోటి ఆశలతో కేసీఆర్ పంచన చేరారు. తమ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు కేసీఆర్ తప్పకుండా తమను ఆదుకుంటారని ఆశించారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసినప్పుడు, సన్నాహకంగా నిర్వహించిన ప్రతి సమావేశానికీ హాజరై శాలువాలు కప్పా, పూల బొకేలు కూడా ఇచ్చారు.
కానీ.. భారాస ఆవిర్భావం తర్వాత.. కేసీఆర్ మాత్రం వారికి హ్యాండిచ్చారు. వారి రాష్ట్రంలో ఎన్నికల అవసరం వచ్చినప్పుడు.. కనీసం మాటసాయం కూడా, ప్రచార సాయం కూడా చేయలేదు. ఆయన హ్యాండిచ్చిన తర్వాత.. ఇక వారికి గత్యంతరం ఏముటుంది? భాజపా గూటికే చేరబోతున్నారు. కర్ణాటకలోని జనతాదళ్ ఎస్ పార్టీ పరిస్థితి ఇది.
కర్నాటక రాజకీయాల్లో కమలదళానికి, దేవెగౌడ్-కుమారస్వామి ల సారథ్యంలోని జెడిఎస్ కు మధ్య మళ్లీ పొత్తులు కుదిరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా శాసనసభలో తమ ప్రతిపక్ష నేతను కూడా ఎంపిక చేయలేదు. ఇది వ్యూహాత్మకం అనే వార్తలు వస్తున్నాయి. జేడీఎస్ తో పొత్తు కుదిరిన తర్వాత.. శాసనసభలో ఎన్డీయేను ప్రతిపక్షంగా పరిగణించాలని కోరుతారని, ఎన్డీయే సారథిగా, ప్రతిపక్షనేతగా కుమారస్వామికే సారథ్యం కట్టబెడతారని అనుకుంటున్నారు.
కుమారస్వామి కూడా.. తమ పార్టీ ఉనికి కాపాడుకోవాలంటే.. పొత్తులు తప్పవని తేల్చి చెబుతున్నారు. జేడీఎస్ ను భాజపా బి-టీమ్ గా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభివర్ణినంచినప్పుడు.. ‘మీ వల్లనే మేం ఒక్కటి కావాల్సి వస్తోంది’ అని కుమారస్వామి బదులివ్వడం ఈ పొత్తులను దాదాపుగా ఖరారుచేస్తోంది.
ఈ పొత్తులు కేవలం కర్ణాటక రాజకీయాలను మాత్రమే ప్రభావితం చేస్తాయని, వీటి ప్రభావం ఇతర ప్రాంతాల మీద ఉండదని అనుకుంటే పొరబాటు అవుతుంది. ఎందుకంటే.. కుమారస్వామిని.. తెలంగాణ సీఎం కేసీఆర్ బాగా చేరదీశారు. చివరినిమిషంలో పట్టించుకోవడం మానేశారు. కారణాలు మాత్రం బయటకు రాలేదు.
కేసీఆర్ చేయూత అందిస్తే.. కన్నడ అసెంబ్లీ ఎన్నికల్లో ఏకపక్షంగా అధికారంలోకి రాకపోయినప్పటికీ.. గణనీయంగా సీట్లు సాధించగలమని, సంకీర్ణానికి సారథ్యం వహించగలమని కుమారస్వామి కన్న కలలు కల్లలయ్యాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ నమ్మిన వారిని కూడా నట్టేట ముంచేస్తారనే అభిప్రాయం ఇతరులకు కలిగితే ఆశ్చర్యం లేదు. జాతీయ రాజకీయాల్లో తన హవా నడిపించాలని భావిస్తున్న కేసీఆర్ కు ఈ కన్నడ కొత్త పొత్తుల వల్ల కాస్త క్రెడిబిలిటీ దెబ్బతినవచ్చు.