బ్రో సినిమా..దాదాపు 170 నుంచి 180 కోట్ల మార్కెట్. సుమారు 40 కోట్ల లాభం అని ఓ అనధికార అంచనా. కానీ నిర్మాతగా పేరు వున్న పీపుల్స్ మీడియాకు వచ్చేదెంత? మిగిలేదెంత? రిస్క్ ఎంత? ఈ టోటల్ సీన్ ఇలా వుంది.
బ్రో సినిమా నిర్మాణానికి దాదాపు 140 కోట్లకు పైగా ఖర్చయింది. కేవలం పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, సాయిధరమ్ తేజ్ ల రెమ్యూనిరేషన్లే దగ్గర దగ్గర 85 కోట్లు అయ్యాయి. తేజు కు మిగిలిన ఇద్దరి కన్నా తక్కువ 8 కోట్లు అని తెలుస్తోంది. త్రివిక్రమ్ కు 15 కోట్లు అని టాక్ వుంది. సముద్రఖని, థమన్, ఇలా ఏస్ టెక్నీషియన్ల రెమ్యూనిరేషన్లు వుండనే వున్నాయి. కొంతకాలం వర్క్ చేసిన బుర్రా సాయి మాధవ్ రెమ్యూనిరేషన్ వుండనే వుంది.
నిర్మాణ వ్యయం 30 కోట్ల వరకు వుంటుందని అంచనా. మొత్తం మీద 140 కోట్ల వరకు ఖర్చు వుందని లెక్కలు వినిపిస్తున్నాయి. ఆదాయం అన్నీ కలిపి 180 కోట్ల వరకు వుంది. అంటే మిగులు దాదాపు 40 కోట్లు. ఇక్కడి వరకు బాగానే వుంది. కానీ ఈ నలభై కోట్లు పీపుల్స్ మీడియాకు వచ్చేయడం లేదు. నాలుగు వాటాలు. ఒకటి జీ స్టూడియోస్, రెండు పవన్ కళ్యాణ్, మూడు త్రివిక్రమ్.. నాలుగు పీపుల్స్ మీడియా.
అంటే పీపుల్స్ మీడియా వాటాకు వచ్చేది మహా అయితే పది కోట్లు. కానీ సినిమా విడుదల తరువాత రిస్క్ అంటూ వుంటే అది ఎవరికి? పీపుల్స్ మీడియాకే. ఎందుకంటే జీఎస్టీలు వెనక్కు ఇవ్వడం, టీడీఎస్ లు, సినిమా తేడా వస్తే రాబోయే సినిమాల్లో తగ్గించుకోవడం ఇవన్నీ పీపుల్స్ మీడియా బాధ్యతే. పవన్ తో సినిమా చేసాం అని చెప్పుకోవడానికి తప్ప అంతకన్నా ఎక్కువ ఉపయోగం అయితే వుండేటట్లు కనిపించడం లేదు ‘బ్రో.