టొమాటో.. టమాటో.. టమాటాలు… ఎలా పిలిచినా ఇందులో మనకు చాలా దగ్గరితనం ఉంది. మనవి అనుకున్న చాలా వంటల్లో టమాటాల వినియోగం తప్పనిసరి. ఆనియన్, టొమాటలతో కూడిన బర్గర్లు, శాండ్ విచ్ లు, ఇండియన్ ఫుడ్, ఆంధ్రా ఫుడ్, రాయలసీమ రుచులు.. ఎన్ని ప్రాంతీయవాదపు వంటలున్నా… టొమాటోలు అన్నింటా ఉంటాయి. కేవలం కాయగానే కాకుండా, కెచప్ రూపంలో కూడా టొమాటలో అద్దకంతో అనేక రుచులు ఊరిస్తాయి. స్థూలంగా టొమాటో లేనిదే వంటింటికి రోజు గడవదంతే! ఇక టొమాటో ఊరగాయ కూడా చేసి పెట్టుకుంటారు చాలా ముంది. ఉత్తి టొమాటాలతోనే చట్నీ చేసుకుని, దానికి ఉల్లిపాయను సన్నగా తరిగి నూనెలో వేయించి కలిపితే.. దాని రుచి అమోఘం! ఇలా సోలోగా అయినా, ఇతర కాయగూరలతో కలిపి అయినా… టొమాటో ప్రతి వంటలోనూ తన రుచిని చాటుకుంటూ ఉంటుంది. సాధారణంగా పత్రికల్లో వంట పేజీల వార్తల్లో ఉండాల్సిన టొమాటో ఇప్పుడు పతాక శీర్షికలను అందుకుంది! దాని ధరతో!
టమాటాలు అనే పిలుపులో ఎంత తెలుగుదనమో, దగ్గరి తనమో ఉన్నా.. వాటి పుట్టుకతో మాత్రం తెలుగు గడ్డకో, భారతదేశానికే కాదు.. అసలు ఆసియాకు కూడా సంబంధం లేదు. టొమాటోల పుట్టుక తొలుత జరిగింది దక్షిణమెరికాలోని ఆండిస్ పర్వతాల్లో. పెరూ, లేదా ఈక్వెడర్ ల పరిధిలోకి వచ్చే ఆండిస్ పర్వతాల్లో టొమాటోలు జనించాయి. చాలా వందల ఏళ్లకు ఇవి దక్షిణమెరికాను దాంటాయి. 16వ శతాబ్దంలో యూరోపియన్లు టొమాటో విత్తనాలను తమ దేశానికి తీసుకెళ్లి నాటుకున్నారు. అయితే అప్పటికీ వీటిని వంటలకు వాడేవారు కాదట! కేవలం గార్డెన్ ట్రీ గా టొమాటోను భావించేవారు అప్పటికీ! మొదట్లో ఆకుపచ్చగా, ఆ తర్వాత పండి ఎర్రగా అందంగా కనిపించే టొమాటోలను అలా ఇంటి ఆవరణలో షో కోసం పెంచుకున్నారు యూరోపియన్లు. ఆ తర్వాత కొన్ని దశాబ్దాలకు వాటిని వంటలో వాడటం మొదలైంది. అయితే మొదట్లో టొమాటోలను విషపూరితం అనుకున్నారట! హై క్లాస్ యూరోపియన్లు వీటిని తినే వారు కాదట! ఇవి అడవి మొక్కలని, విషం అనే ప్రచారాలతో వీటిని వంటకు వాడే వారు కాదట.
అయితే దిగువ తరగతి వాళ్లు ధైర్యం చేసి వంటల్లో టొమాటోను వాడటం మొదలైంది. దీని రుచి గురించి వారి మాటల్లో విని ఆ తర్వాత హై క్లాస్ జనాలు కూడా టొమాటోలను వాడటం మొదలుపెట్టారట. మరి 16 వ శతాబ్దంలో దక్షిణమెరికా నుంచి యూరప్ చేరిన టొమాటో వయా యూరప్ గా ఇండియా వచ్చి ఉంటుంది. మనం అనునిత్యం వాడే టొమాటోలు మన నాగరితతో చేరి బహుశా ఈ రెండు మూడు వందల సంవత్సరాల లోపే అంటే కాస్త ఆశ్చర్యం కలుగుతుంది. మూడు వందల యేళ్ల కిందట టొమాటోల వాడకం లేదంటే అప్పటి జనాలు ఏం తినే వారబ్బా.. ఆడవాళ్లు వంటను వండేందుకు ఎంతగా తల పట్టుకునే వారబ్బా అని ఇప్పటి ఆడవాళ్లు ఫీలవ్వొచ్చు! ఉదయం లేవగానే ఏం వండాలనే ప్రశ్నకు ఇంట్లోని వారి కన్నా టొమాటోలే స్త్రీలకు సులువుగా సమాధానం ఇస్తాయి. పప్పు, సాంబర్, రసం ఇలా ఏ కూర చేయాలన్నా.. టొమాటో లేకపోతే అంతే సంగతులు!
ప్రతి కూరగాయకూ వేర్వేరు దేశాల్లో వేరే పేరుంటుంది! అయితే టొమాటోలకు మాత్రం..కాస్త ఇటు ఇటుగా అంతటా ఒకటే పేరు! ఉల్లిపాయకు వేర్వేరు భాషల్లో వేర్వేరు పేరు. అలాగే ప్రాంతాన్ని బట్టి కూడా కొన్ని చోట్ల ఎర్రగడ్డలు, మరి కొన్ని చోట్ల ఉల్లిపాయల అంటారు తెలుగునాట కూడా! అయితే టొమాటోను దేశమంతా టొమాటో అనో, టమాటలు అనో, టమేటికాయలు అనో… ఇలా స్లాంగ్ మారుతుంది కానీ, పేరు మారదు. టమాటల్ అనే సౌతమెరికన్ పదమే దీని పేరుకు మూలం. అయితే వీటిని వంటల్లో తొలి సారి వాడిన స్పెయిన్, ఇటాలియన్లు దీనికి తమవైన పేర్లు పెట్టుకున్నారు. ఇటాలియన్లు దీన్నీ గోల్డెన్ యాపిల్ అన్నారు. ఫ్రెంచి వాళ్లు దీని తమ భాషలో లవ్ యాపిల్ అని పిలుచుకున్నారు. మొదట్లో టొమాటోలు పూర్తిగా మాగినా ఎల్లో కలర్లో ఉండవేట. ఇప్పటికీ ఆ కలర్ వాటికి పూర్తిగా పోలేదు. పూర్తిగా పండిపోతే ఎరుపు గా అవుతాయి.
మరి ఇప్పుడు అసలు సంగతికొస్తే.. కిలో టొమాటో వంద రూపాయలను దాటిందని, నూటా యాభై అని, కాదు రెండు వందలు అని, రెండు వందల యాభై అని.. వార్తలు వస్తూ ఉన్నాయి. ఇక నార్తిండియాలో అయితే కిలో టొమాటో 250 దాటిందని కథనాలు వస్తున్నాయి. ఈ ధరల అంశం పై బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ ఉన్నారు. తను ఈ మధ్యకాలంలో టొమాటో లు తినడం తగ్గించినట్టుగా బాలీవుడ్ నటుడు సునీల్ షెట్టి ప్రకటించుకున్నాడు పాపం! ఇది వరకూ ఇతడి డైట్లో టొమాటోలు గట్టిగా ఉండేవట, ఇప్పుడు ధరలు పెరగడంతో తన డైట్ ప్లాన్ నే చేంజ్ చేసుకున్నాడట ఈ బాడీ బిల్డర్! అలాగే ఈయనకు హోటళ్లు కూడా ఉన్నాయి. వాటి కోసం రెగ్యులర్ గా టొమాటోలు కొంటూ ఉంటాడట. ధరలు పెరగడంతో బేరం ఆడాల్సి వస్తోందని వాపోయాడు! మరి ఈ వయసులో కూడా కోట్ల పారితోషికం తీసుకునే సునీల్ షెట్టిని కూడా టొమాటో బెంబేలెత్తిస్తోంది అనుకోవాలా.. లేక జనాల సంకుచిత్వం ఈ స్థాయిలో ఉందనుకోవాలో!
టొమాటోలు ఇలా పతాక శీర్షికలు ఎక్కడం కొత్త కాదు. గతంలో కూడా అనేక మార్లు టొమాటో ధరలు పతాక శీర్షికలకు ఎక్కాయి. అయితే అప్పుడు భారీ ధరతో కాదు. టొమాటో ధర కిలోకి రూపాయికి పడిపోయిందని, అర్ధకు అడుగుతున్నారని, బహిరంగ మార్కెట్ లో టొమాటోలు రెండు రూపాయలకే ఇస్తున్నారనే వార్తలు అనే మార్లు.. చెప్పాలంటే కొన్ని వందల సందర్భాల్లో వచ్చి ఉంటాయి. ఆ ధర గిట్టుబాటు కాదు రైతుకు. కొన్ని సార్లు అయితే మార్కెట్ వరకూ తీసుకు వచ్చి కూడా కొనే నాథుడు లేక, అక్కడ పారబోసి వెళ్లే రైతుల వెతలూ వార్తల్లోవే! అయితే పండించిన పంటను అలా పారబోసి వెళ్లిన రైతును చూసి అయ్యోపాపం అనే నాథుడు ఉండడు.
ఇప్పుడు ధర పెరిగింది కాబట్టి.. టొమాటో గురించి బాలీవుడ్ సెలబ్రిటీలు, వందల కోటీశ్వరులు కూడా వాపోతున్నారు. టొమోటోలను సబ్సిడీ ధరకే అందిస్తామంటూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి. మరి టొమాటో ధరలను ప్రభుత్వాలే తట్టుకోలేకపోతున్నాయి పాపం! సబ్సిడీలను ప్రకటించేస్తూ ఉన్నాయి. మరి రైతు పారబోసినప్పుడో, లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి కిలో రెండు రూపాయలకు కూడా దక్కనప్పుడు ప్రభుత్వాలు ఎందుకు స్పందిచవో! ఒక కుటుంబం వారానికి కిలో టొమోటోలు వినియోగిస్తుందనుకున్నా.. కిలో 250 అనుకున్నా.. ఒక నెలకు ఆ కుటుంబపై భారం వెయ్యి రూపాయలు అనుకోవచ్చు. మరి దీనికే ప్రభుత్వం సబ్సిడీలు ప్రకటిస్తే.. ఒక ఎకరం టొమాటో సాగుకు కనీసం 60 నుంచి 80 వేల రూపాయల వరకూ ఖర్చవుతోంది. ఏవైనా తెగుళ్లు తగులుకున్నాయంటే.. కనీస ఖర్చు లక్షకు చేరుతుంది.
మరి లక్ష ఖర్చు చేసి ఎకరంలో టొమాటో పండించినప్పుడు దాన్ని కిలో రెండు రూపాయలకో, అంతకన్నా తక్కువకో అమ్ముకుంటే.. రైతుకు గిట్టేదేమిటి? మూడు నాలుగు నెలలు కష్టపడి పండించి రోడ్డున పారబోసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వాలకు రైతు వ్యథ అర్థం కాదా? ఇప్పుడు వినియోగదారులపై తలా కాస్త భారం పడొచ్చు. అయితే నష్టపోతే.. ఆయా రైతు కుటుంబాలన్నీ అప్పుల పాలవుతాయే! వాటిని తీర్చుకోవడానికి యేళ్లకు ఏళ్లు పడుతుందే!
ఇప్పుడు కూడా ఏదో రైతు ఉద్ధరణ కోసం టొమాటోల ధరలను ఎవ్వరూ పెంచలేదు. ఎక్కడో పంట నష్టం జరిగింది. దాని ఫలితంగా ఉన్న సరుకుకు డిమాండ్ ఏర్పడింది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇలాగే టొమోటో కు విపరీతమైన ధర వచ్చింది. రెండేళ్ల కిందట ఇలాంటి ఖరీఫ్ కాలంలోనే భారీ వర్షాలు కురిశాయి. దీంతో చిత్తూరు జిల్లాలో టొమాటో పంటకు తీవ్ర నష్టం జరిగింది. చిత్తూరు జిల్లా టొమాటో సాగుకు పేరు గాంచింది. మదనపల్లె మార్కెట్ టొమాటో రైతుకు పెద్ద మార్కెట్. రాయలసీమలో ఎక్కడ టొమాటో పండినా అది మదనపల్లె మార్కెట్ కే ముఖ్యంగా చేరుతుంది. అక్కడ ధర దక్కుతుందని రైతుకు నమ్మకం.
ప్రతి పంటకూ ఒక మార్కెట్ ఉన్నట్టుగా మదనపల్లె మార్కెట్ టొమాటోకు కేరాఫ్. చిత్తూరు జిల్లాలో సాగు కూడా చాలా ఎక్కువ. భారీ వర్షాలతో రెండేళ్ల కిందట ఆ ప్రాంతమంతా టొమాటో దెబ్బతింటే.. ఆ సమయంలో మిగతా ప్రాంతాల్లో పండిన టొమాటోకు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. అప్పుడు చిత్తూరు జిల్లా ఆవల, కాస్త తక్కువ వర్షాలు పడ్డ ప్రాంతంలో టొమాటోలు సాగు చేసిన వారి పంట పండింది! రెండెకరాల్లో టొమాటో సాగు చేసిన రైతులు కూడా.. అప్పుడు ఐదారు లక్షల రూపాయలను మిగుల్చుకున్నాడు. అప్పుడు రైతు దగ్గరే టొమాటో కిలో వంద రూపాయలు పలికింది. అది ఆల్ టైమ్ హై. ఇప్పుడు ఆ రికార్డులు కూడా బద్ధలవుతున్నాయి. రైతుల దగ్గర నుంచినే టొమాటో 150 పలుకుతోంది! ఇది కొత్త రికార్డు!
అదే చిత్తూరు జిల్లాలో ఈ యేడు కొంతమంది రైతులు టొమాటో సాగులో లక్షల రూపాయలు గడించారని వార్తలు వస్తున్నాయి. కొందరైతే ఇరవై, ముప్పై లక్షల రూపాయలు కూడా సంపాదించుకున్నారట. ఐదారు ఎకరాల్లో టొమాటో సాగు చేసిన రైతులు ఈ స్థాయిలో సంపాదించుకుని ఉండవచ్చు ఈ ధరల్లో. అయితే ప్రతియేటా ఇలానే ఉంటుందనుకోవడం మాత్రం పెద్ద పొరపాటు. రెండేళ్ల కిందట రైతుల దగ్గర గరిష్టంగా వంద రూపాయలు పలికిన టొమాటోను చూసి.. అదే ధర అనుకుని.. ఆ వెంటనే రెట్టింపు స్థాయిలో సాగు చేశారు. ఆ దెబ్బకు రేటు మళ్లీ మొదటకు వచ్చింది.
గత ఏడాది చెప్పుకోదగిన రేటు ఏమీ లేదు. ఈ సారి మళ్లీ పెరిగింది. ఇలా సీజన్ సీజన్ కూ హెచ్చు తగ్గులు తప్పవు. వీటిని తట్టుకునే రైతులు పంట పెడతారు. వీటికి ప్రిపేర్ అయ్యే వారి సాగు సాగుతుంది. ఇప్పుడు ఎకరా టొమాటో సాగులో లక్షలు సంపాదించిన వారే, రేపు అదే ఎకరా పంటకు పెట్టుబడి సంపాదించుకోలేకపోవచ్చు. ఇలాంటి వ్యవసాయం ఒక జూదంగా సాగుతోంది. ధర దక్కినప్పుడు వారిని చూసి తెగ ఫీలయ్యే జనాలకు ధర తగ్గిపోయినప్పుడు రైతులపై సానుభూతి చూపే టైముండదు.
టొమాటోలు ధర పెరిగాయని బాధపడిపోకుండా.. తమకోసం వాటిని పండించే రైతు ఎప్పుడో నష్టపోయి ఉంటే, ఇప్పుడు అతడికి కాస్త మేలు జరుగుతోందని ఆనందించాలి. ఎకరాల కొద్దీ టొమాటో సాగు చేసి సంవత్సరాలకు సంవత్సరాలు పెట్టుబడులు రాబట్టుకోవడంలో తనమునకలైన రైతుకు ఇప్పుడు స్వాంతన లభిస్తోందని వినియోగదారులు కాస్త ఆనంద పడాలి.
-జీవన్ రెడ్డి. బి