ఓటీటీతో పాటు.. మరోసారి థియేటర్లలోకి..!

సాధారణంగా ఓ సినిమా థియేటర్లలోకి వస్తుంది, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ మంచి అకేషన్ చూసి సినిమాను మరోసారి రీ-రిరీజ్ చేసే ట్రెండ్ కూడా ఇప్పుడు నడుస్తోంది. కానీ లియో విషయంలో…

సాధారణంగా ఓ సినిమా థియేటర్లలోకి వస్తుంది, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ మంచి అకేషన్ చూసి సినిమాను మరోసారి రీ-రిరీజ్ చేసే ట్రెండ్ కూడా ఇప్పుడు నడుస్తోంది. కానీ లియో విషయంలో ఇవన్నీ ఒకేసారి కలిసికట్టుగా సాగుతున్నాయి.

విజయ్-త్రిష హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా లియో. ఈ సినిమా థియేట్రికల్ హంగామా ముగిసింది. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడీ సినిమా స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కు పెట్టబోతోంది. ఈ మేరకు ట్రయిలర్ కట్ కూడా విడుదల చేసింది. ఓటీటీ వెర్షన్ కు అదనంగా 18 నిమిషాల క్లిప్స్ కూడా జోడించిన సంగతి తెలిసిందే.

అయితే ఇంతకంటే ఎక్సయిటింగ్ మేటర్ ఏంటంటే.. ఓటీటీతో పాటు ఈ సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ప్రస్తుతం కోలీవుడ్ మార్కెట్లో ఆఫ్-సీజన్ నడుస్తోంది. దీపావళికి రిలీజైన జపాన్ సినిమా ఫ్లాప్ అవ్వడం, జిగర్తాండా డబుల్ ఎక్స్ హవా తగ్గడంతో.. థియేటర్లలో స్పేస్ ఉంది.

రజనీకాంత్ లాల్ సలామ్ వచ్చేవరకు మరో పెద్ద సినిమా రావడం లేదు. దీంతో లియో సినిమానే మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తోంది యూనిట్. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రాబోతోంది. ఓటీటీ వెర్షన్ వచ్చిన ఓ వారం రోజులకు లియో రీ-రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.