ప్రతి వారం అరడజనుకు తగ్గకుండా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే ఈ వీకెండ్ కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఎప్పట్లానే ఈ వీకెండ్ కూడా 7 సినిమాలు విడుదలకు సిద్ధమవ్వగా.. అందులో ఏకంగా 4 సినిమాలు ఒకే జానర్ లో తెరకెక్కినవి కావడం విశేషం. అదే థ్రిల్లర్ జానర్.
మంగళవారం, స్పార్క్, మై నేమ్ ఈజ్ శృతి, అన్వేషి.. ఇలా ఈ 4 సినిమాలు థ్రిల్లర్ మూవీసే. ఈ నాలుగూ ఒకే రోజు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న సినిమా మంగళవారం.
థ్రిల్లర్ కాన్సెప్ట్ తో, రూరల్ బ్యాక్ డ్రాప్ లో అజయ్ భూపతి తెరకెక్కించిన సినిమా మంగళవారం. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలో అడుగడుగునా థ్రిల్ ఎలిమెంట్స్ ఉంటాయని చెబుతున్నాడు దర్శకుడు. సినిమాకు ఎ-సర్టిఫికేట్ వచ్చినప్పటికీ, అందర్నీ అలరిస్తుందని అంటున్నాడు.
ఇక స్పార్క్ అనే సినిమా కూడా థ్రిల్లర్ మూవీనే. అన్నీ తానై విక్రాంత్ తెరకెక్కించిన థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. అమెరికాలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా పూర్తి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ కథ రాసుకున్నాడట విక్రాంత్. సినిమా అడుగడుగునా ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తుందని చెబుతున్నాడు.
ఇక మై నేమ్ ఈజ్ శృతి, అన్వేషి సినిమాలు కూడా థ్రిల్లర్ జానర్ లోనే తెరకెక్కాయి. స్కిన్ గ్రాఫ్టింగ్ కాన్సెప్ట్ తో మర్డర్ మిస్టరీగా మై నేమ్ ఈజ్ శృతి సినిమా తెరకెక్కగా.. ఓ హాస్పిటల్ చుట్టూ నడిచే హత్యల నేపథ్యంలో థ్రిల్లర్ గా తెరకెక్కింది అన్వేషి సినిమా.
ఇలా ఒకేసారి ఒకే రోజు థియేటర్లలోకి వస్తున్న ఈ థ్రిల్లర్లలో ఏది మెరుస్తుందో చూడాలి. ఈ సినిమాలతో పాటు జనం, నేనెక్కడున్నా, సప్తసాగరాలు దాటి సైడ్-బి సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి.