స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణా… అబ్బే ఎక్కడా…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వేయి రోజులకు పైగా ఉక్కు కార్మికుల ఉద్యమం సాగుతోంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఏదీ లేదని అసలు మొదలే కాలేదని బీజేపీకి చెందిన రాజ్యసభ…

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద వేయి రోజులకు పైగా ఉక్కు కార్మికుల ఉద్యమం సాగుతోంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది ఏదీ లేదని అసలు మొదలే కాలేదని బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అసలు మొదలే కాలేదని ఆయన అంటూనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని కూడా అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం అన్నది మాత్రం బీజేపీ పెద్దలే చెప్పాలి. జీవీఎల్ ఇంతకు ముందు కూడా ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయింది అని అన్నారు.

ఇపుడు మరోసారి అదే మాట అంటున్నారు. సమీప భవిష్యత్తులో ప్రైవేటీకరణ అన్నది జరగనే జరగదు అని ఆయన భరోసా ఇస్తున్నారు. అంతే కాదు లాభాలు బాటలో విశాఖ ఉక్కుని నడపాలన్న ఉద్దేశంలో కేంద్రం  ఉందని ఆయన పేర్కొన్నారు.

జీవీఎల్ చెప్పినది బాగానే ఉంది. ఆయన మంచి ఉద్దేశ్యంతో చెప్పారని అనుకున్నా ఉక్కు కార్మికులు డిమాండ్ చేస్తున్నది కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రం దీని మీద పార్లమెంట్ లో కీలకమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. అలాగే ఉక్కు మంత్రి అయినా విశాఖను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని చెప్పాలని అంటున్నారు

గతంలో నిండు సభలో ప్రైవేటీకరణ జరిగి తీరుతుందని కేంద్ర మంత్రులు ప్రకటించారు, ఇపుడు కేంద్రం నుంచి ఏ రకమైన ఊరట కలిగించే ప్రకటన రావడంలేదు, ఎంపీ మాత్రం ప్రైవేటీకరణ మొదలే కాలేదని చెబుతూ ఇక జరగదు అని అంటున్నారు.

అందుకే ఈ గందరగోళం అంతా ఎందుకు విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం కాదు ఇక కాబోదు అని కేంద్రం విస్పష్టమైన ప్రకటన చేస్తే సరిపోతుంది అని ఉక్కు కార్మిక సంఘాలు అంటున్నాయి. అది జరిగితేనే తప్ప నమ్మలేమని అంటున్నారు.