రష్మిక డీప్ ఫేక్ వీడియో మూలాలు బిహార్ లో..!

కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై చాలామంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా బిగ్ బి అమితాబ్ లాంటి…

కొన్ని రోజుల కిందట సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన రష్మిక డీప్ ఫేక్ వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై చాలామంది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏకంగా బిగ్ బి అమితాబ్ లాంటి వాళ్లు సైతం ఖండించడంతో.. కేంద్రం స్పందించింది. మరోవైపు ఢిల్లీ మహిళా కమిషన్ కూడా దృష్టి సారించింది.

దీంతో రష్మిక డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసుకు సంబంధించి కీలక పురోగతి సాధించారు పోలీసులు. బిహార్ కు చెందిన ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి వయసు 19 ఏళ్లు మాత్రమే.

నిజానికి డీప్ ఫేక్ వీడియో తయారుచేసింది ఇతడు కాదు. మొట్టమొదట షేర్ చేసిన వ్యక్తి ఇతడు. ఈ వీడియోకు సంబంధించి వివరాలు తెలపాల్సిందిగా, మెటాకు పోలీసులు లేఖ రాసిన సంగతి తెలిసిందే. వాళ్లు ఇచ్చిన వివరాల ఆధారంగా బిహార్ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. వీడియో ఎక్కడ దొరికిందో అతడి ద్వారా ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు.

మరో సోషల్ మీడియా వేదిక పైనుంచి ఆ వీడియోను డౌన్ లోడ్ చేసినట్టు సదరు యువకుడు అంగీకరించాడు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవ్వర్నీ అరెస్ట్ చేయలేదు. కేవలం కొంతమందిని విచారిస్తున్నారంతే.

ప్రస్తుతం రష్మిక, తన హిందీ మూవీ యానిమల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రచారంలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. తను రికవర్ అవుతున్నానంటూ ఆమె 2 ఫొటోల్ని కూడా ఈరోజు షేర్ చేసింది.