స్కిల్ స్కామ్లో అరెస్టయిన చంద్రబాబు తన అరెస్ట్ అక్రమం, అన్యాయమంటూ న్యాయ పోరాటం చేస్తున్నారు. అయితే ఆయనకు సర్వోన్నత న్యాయస్థానంలో సైతం ఊరట దక్కడం లేదు. క్వాష్ పిటిషన్పై నేడు చారిత్రక తీర్పు వెలువడుతుందని ఎల్లో మీడియా బుధవారం సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తూ హైప్ క్రియేట్ చేసింది. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తుందంటూ రఘురామ లాంటి వాళ్లు జోస్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో క్వాష్ పిటిషన్పై తీర్పు దీపావళి సెలవుల తర్వాతే అని సుప్రీంకోర్టు స్పష్టం చేయడం గమనార్హం. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనే అంటూ చంద్రబాబు తరపున సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు ఖరీదైన న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ్ లూథ్రా, అలాగే సీఐడీ తరపున ముకుల్ రోహిత్గీ వాదించారు.
విచారణంతా చంద్రబాబుకు 17ఎ వర్తిస్తుందా? లేదా? అనే విషయమై సాగింది. అసలు తనపై కేసు కొట్టేయించుకోడానికి చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. బాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఈ నెల 8 లేదా 9న తీర్పు వెలువడుతుందని ఏపీ సమాజం ఉత్కంఠతతో ఎదురు చూసింది. అయితే ఆశించినట్టు తీర్పు వెలువడలేదు.
దీపావళి సెలవుల తర్వాతే తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఇది టీడీపీకి నిరాశ మిగిల్చింది. అలాగే ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసుకున్న పిటిషన్పై విచారణను ఈ నెల 30కి సుప్రీంకోర్టు వాయిదా వేయడం గమనార్హం. చంద్రబాబు పిటిషన్లను జస్టిస్ అనిరుద్ద బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన బెంచ్ విచారించింది. ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఫైబర్ పిటిషన్పై నెలాఖరుకు వాయిదా వేయడంతో టీడీపీ శ్రేణులు ఉస్సూరుమన్నాయి.